కోల్‌కతా: జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో కేరళ 4–2తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్‌పై నెగ్గి ఆరోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కేరళ తరఫున 19వ నిమిషంలో ఎస్. జితిన్ గోల్ సాధించడంతో తొలి అర్ధభాగంలో కేరళ ఆధిపత్యం సాగింది.
రెండో అర్ధభాగంలో బెంగాల్ తరఫున 68వ నిమిషంలో జితెన్ ముర్మూ గోల్ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. అదనపు సమయంలో బెంగాల్ తరఫున రాజన్ బర్మన్ (112వ ని.లో), కేరళ తరఫున విబిన్ థామస్ (117వ ని.లో) చెరో గోల్ సాధించడంతో మ్యాచ్ 2–2తో మళ్లీ సమమైంది. దీంతో షూటౌట్ ద్వారా విజేతను తేల్చారు.
షూటౌట్‌లో కేరళ తరఫున రాహుల్ వి రాజ్, జితిన్ గోపాలన్, జెస్టిన్ జార్జ్, ఎస్. సిసాన్ గోల్స్ సాధించగా... బెంగాల్ తరఫున తీర్థాంకర్, సాంచయన్ సమద్దర్‌లు మాత్రమే గోల్ చేయడంలో సఫలమయ్యారు. దీంతో 4–2తో కేరళ విజయం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment