
మలప్పురం (కేరళ): జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కేరళ ఫుట్‌బాల్ ప్లేయర్ హమ్జా కోయా శనివారం కరోనా వైరస్‌తో మృతి చెందారు. 61 ఏళ్ల హమ్జా కోయా 1981 నుంచి 1986 వరకు సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ పుట్‌బాల్ క్లబ్‌లు మోహన్ బగాన్, మొహమ్మదన్ స్పోర్టిం గ్ జట్ల తరఫున ఆడారు. రెండుసార్లు భారత ఫుట్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ముంబైలో స్థిరపడిన హమ్జా కోయా తన కుటుంబసభ్యులతో కలిసి మే 21న రోడ్డు మార్గం ద్వారా ముంబై నుంచి కేరళకు వచ్చారు. ఆయనతోపాటు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మునిమనవళ్లకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న హమ్జా కోయా స్థానిక మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం మృతి చెందారు.