
దుమ్ము రేపిన సర్ఫరాజ్, ఖలీల్
సావర్(బంగ్లాదేశ్): అండర్-19 వరల్డ్ కప్ సన్నాహక ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో యువ భారత్ దుమ్మురేపుతోంది. సోమవారం పాకిస్థాన్ తో జరిగిన వార్మప్ వన్డే మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ ను ఖలీల్ అహ్మద్ కుప్పకూల్చగా, ఆ తరువాత బ్యాటింగ్ లో సర్పరాజ్ ఖాన్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ ను ఎదుర్కోలేక డీలా పడిన పాకిస్తాన్ రెండొందల పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. ఖలీల్ అహ్మద్ 8.0 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 44.1 ఓవర్లలో 197 పరుగులకే చాపచుట్టేసింది.
పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ ఉమర్(36), సల్మాన్ ఫయ్యాజ్(29), గౌహార్ హాఫీజ్(25), హాసన్ మొహ్ సిన్(33) కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో సర్పరాజ్ ఖాన్ తనదైన శైలిలో బ్యాట్ ను ఝుళిపించాడు. 68 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 81 పరుగులు చేసి ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్(28 నాటౌట్),లామ్రోర్(22) మరో వికెట్ పడకుండా భారత్ కు ఘన విజయాన్ని అందించారు.