క్వార్టర్స్‌లో ఓడితే చిరాకుగా ఉంటుంది | Kidambi Srikanth aims to regain lost ground | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ఓడితే చిరాకుగా ఉంటుంది

Mar 26 2019 3:43 PM | Updated on Mar 26 2019 3:43 PM

Kidambi Srikanth aims to regain lost ground - Sakshi

న్యూఢిల్లీ: కనీసం ఒక్క టైటిల్‌ కూడా లేకుండా గత సీజన్‌ను ముగించడం పట్ల భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ పరాజయాల నుంచి బయటపడి...  శారీరకంగా, మానసికంగా దృఢంగా మారితేనే రానున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించే అవకాశం ఉంటుందని ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ అన్నాడు. 2018 నుంచి ఇప్పటివరకు ఆడిన టోర్నీల్లో తొమ్మిది పర్యాయాలు క్వార్టర్స్‌లో, రెండు సార్లు సెమీస్‌లో వెనుదిరిగిన శ్రీకాంత్‌... కేవలం కామన్వెల్త్‌ గేమ్స్‌లో మాత్రం ఫైనల్‌కు చేరాడు. నేటి నుంచి జరుగనున్న ఇండియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీకాంత్‌ దీనిపై స్పందిస్తూ ‘ఇది చాలా చిరాకు కలిగించే అంశం. క్వార్టర్స్‌లో ఓడటం కన్నా తొలిరౌండ్‌లో ఓడితే కాస్త మెరుగ్గా ఉంటుంది. చాలామంది ప్లేయర్లపై నేను ఆధిపత్యం ప్రదర్శించగలను. కానీ కొందరి చేతిలోనే ఓడిపోతూ క్వార్టర్స్‌ లేదా సెమీస్‌లో వెనుదిరుగుతున్నా. దీన్ని అధిగమించేందుకే ప్రయత్నిస్తున్నా’ అని అన్నాడు.

ఈ మూడు, నాలుగు నెలల కాలంలో అనుకున్న ఫలితాలు సాధించగలిగితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకాన్ని సాధిస్తానని అతను ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇందుకోసం శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారతానని అన్నాడు. తరచూ తనను వేధిస్తోన్న గాయాలపై  అసహనం వ్యక్తం చేశాడు. ‘ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. గత రెండేళ్లలో బాగా గాయాల పాలయ్యాను. మలేసియా, ఇండోనేసియా టోర్నీల అనంతరం మడమ గాయంతో బాధపడ్డా. ప్రస్తుతం అంతా సరిగానే ఉంది. సరైన ఫిట్‌నెస్‌ సాధిస్తే టైటిళ్లు నెగ్గే అవకాశం ఉంటుంది. 2017లో మంచి ఫిట్‌నెస్‌ కారణంగానే నాలుగు టైటిళ్లు సాధించగలిగా’నని వివరించాడు. ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారులైన కెంటో మొమోటా, విక్టర్‌ అక్సెల్‌సన్, షి యుకీల నుంచి స్ఫూర్తి పొందుతానని 26 ఏళ్ల ఈ హైదరాబాదీ తెలిపాడు. ‘నిషేధం తర్వాత పునరాగమనం చేసిన మొమోటా అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. అక్సెల్‌సన్, షి యుకీ నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. వీరి నుంచి స్ఫూర్తి పొందుతా. నిలకడగా విజయాలు సాధిస్తూ టాప్‌–3కి చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నా’ అని మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ శ్రీకాంత్‌ చెప్పాడు. ఇండియా ఓపెన్‌లో మంచి డ్రా ఎదురైందని అన్నాడు. భారత ఆటగాళ్లతో తలపడటం కంటే విదేశీ ఆటగాళ్లతో ఆడటం సులభమని శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డాడు. ఇండియా ఓపెన్‌ తొలిరౌండ్‌లో వాంగ్‌ వింగ్‌కీ విన్సెంట్‌తో శ్రీకాంత్‌ తలపడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement