
శ్రీకాంత్, కశ్యప్ ర్యాంకులు కిందకు..
కౌలాలంపూర్:ఇటీవల పేలవమైన ఫామ్ తో తంటాలు పడుతున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ లు తమ ర్యాంకుల్లో మరింత కిందకు పడిపోయారు. తాజాగా గురువారం విడుదల చేసిన వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ కశ్యప్ లు తమ స్థానాలను కోల్పోయారు.
గతవారం దుబాయ్ లో జరిగిన వరల్డ్ సూపర్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్ లో లీగ్ దశను దాటలేకపోయిన శ్రీకాంత్ తొమ్మిదో స్థానానికి పడిపోగా, పారుపల్లి కశ్యప్ 14వ ర్యాంకు నుంచి 15 ర్యాంకు పడిపోయాడు. కాగా, హెచ్ఎస్ ప్రణయ్ తన 20వ ర్యాంకును కాపాడుకోగా, అజయ్ జయరామ్ 22వ స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉండగా చైనాకు చెందిన చెన్ లాంగ్ కు ప్రథమస్థానం దక్కించుకున్నాడు. మహిళల డబుల్స్ లో భారత జోడి జ్వాలా గుత్తా, అశ్విన్ పొన్నప్పలు 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.