
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, పీవీ సింధు మెరిశారు. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి గట్టెక్కారు. మరోవైపు మహిళల డబుల్స్‌లో భారత జోడీల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ శ్రీకాంత్ 21–23, 21–11, 21–19తో భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్‌పై చెమటోడ్చి గెలిచాడు. తాను ఆడిన గత తొమ్మిది టోర్నమెంట్‌లలో శ్రీకాంత్ ఎనిమిదిసార్లు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. పదో టోర్నీలో అతను సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. సాయిప్రణీత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. కానీ కీలకదశలో సాయిప్రణీత్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–16, 21–11తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. నాలుగేళ్ల తర్వాత కశ్యప్ వరల్డ్ టూర్ టోర్నీలో సెమీస్ చేరడం ఇదే ప్రథమం. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో హువాంగ్ యుజియాంగ్ (చైనా)తో శ్రీకాంత్; విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో కశ్యప్ తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో అక్సెల్‌సన్ 21–10, 21–16తో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించాడు.
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 21–19, 22–20తో మియా బ్లిచ్‌ఫెట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్‌లో హి బింగ్‌జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ‘క్వార్టర్ ఫైనల్లో నేను చాలా పొరపాట్లు చేశాను. బింగ్‌జియావోతో జరిగే మ్యాచ్‌లో సంయమనంతో ఆడాల్సి ఉంటుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 10–21, 18–21తో టాప్ సీడ్ గ్రేసియా–అప్రియాని (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 21–10, 21–12తో ప్రణవ్ చోప్రా–శివమ్ శర్మ (భారత్) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment