న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. గత వారం నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ సందర్భంగా శ్రీకాంత్ కాలి కండరాలు పట్టేశాయి. దాంతో ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు అతనికి వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్ నుంచి నేను వైదొలుగుతున్నాను.
కాలి కండరాలు పట్టేయడంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలన్నారు. దాదాపు నెల రోజుల నుంచి నేను విరామం లేకుండా ఆడుతున్నాను. ఇలాగే ఆడితే గాయం తీవ్రత పెరిగే అవకాశముంది. వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక ఈ నెల మూడో వారంలో జరిగే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతాను’ అని శ్రీకాంత్ తెలిపాడు.
మరోవైపు జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడినందుకే శ్రీకాంత్‌కు గాయమైందనడం సహేతుకంగా లేదని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెక్రటరీ జనరల్ అనూప్ నారంగ్ వివరించారు. ‘అగ్రశ్రేణి క్రీడాకారులందరినీ సంప్రదించాకే జాతీయ చాంపియన్‌షిప్ తేదీలను ఖరారు చేశాం. ఒకవేళ ఈ తేదీల్లో జాతీయ చాంపియన్‌షిప్ జరగకపోయుంటే మనోళ్లందరూ మకావు ఓపెన్‌లో ఆడేవారు. శ్రీకాంత్‌ది పెద్ద గాయం కాదు. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే అతను కోలుకుంటాడు’ అని అనూప్ నారంగ్ అన్నారు.
మరోవైపు చైనా ఓపెన్ నుంచి శ్రీకాంత్ తప్పుకోవడంతో అతనికి ప్రపంచ నంబర్‌వన్ అయ్యే అవకాశం క్లిష్టంగా మారనుంది. ప్రస్తుత టాప్ ర్యాంకర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్–77,930 పాయింట్లు), శ్రీకాంత్ (73,403 పాయింట్లు) మధ్య 4,527 పాయింట్ల తేడా ఉంది. ఒకవేళ చైనా ఓపెన్‌లో అక్సెల్‌సన్ విజేతగా నిలిస్తే వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం మరింతగా పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment