ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, వేదిక... ఎన్ని మారినా ఐపీఎల్‌లో ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. పంజాబ్‌తో 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ ఓడింది. ముజీబ్ వేసిన ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఢిల్లీ 12 పరుగులే చేయగలిగింది. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సిన స్థితిలో శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేసి ముజీబ్ తమ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లాడు.
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఐదో పరాజయం... సోమవారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న ప్లంకెట్ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించినా అప్పటికే ఆలస్యమైపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్, ఆండ్రూ టై తలా 2 వికెట్లు పడగొట్టారు.
ప్లంకెట్ జోరు: వరుసగా మూడు మ్యాచ్‌లలో జట్టును గెలిపించిన క్రిస్ గేల్ గాయంతో దూరం కావడంతో పంజాబ్ ఓపెనింగ్ జోడి మారింది. ఈ సీజన్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అవేశ్ ఖాన్ 149 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని ఆడలేక ఫించ్ (2) వెనుదిరగడంతో ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడారు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. పేసర్ ప్లంకెట్ తన వరుస ఓవర్లలో రాహుల్, మయాంక్‌లను ఔట్ చేయడంతో పంజాబ్ కష్టాలు పెరిగాయి. యువరాజ్ సింగ్ (17 బంతుల్లో 14; 1 ఫోర్) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. అయితే మరో ఎండ్‌లో మెరుగ్గా ఆడుతున్న నాయర్ ఆటను ప్లంకెట్ ముగించగా... మరుసటి ఓవర్లోనే ప్లంకెట్ చక్కటి క్యాచ్‌కు మిల్లర్ (19 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. తొలి 10 ఓవర్లలో 68 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్... తర్వాతి 10 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ప్లేను మినహాయిస్తే మిగిలిన 14 ఓవర్లలో ఆ జట్టు కేవలం 5 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే కొట్టడం పరిస్థితిని సూచిస్తోంది.
అయ్యర్ మినహా: ఐపీఎల్‌లో తొలిసారి ఆడే అవకాశం దక్కించుకున్న భారత అండర్–19 కెప్టెన్ పృథ్వీ షా (10 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు చక్కటి షాట్లు ఆడాడు. అయితే శరణ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన తర్వాత అదే జోరులో రాజ్‌పుత్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో మ్యాక్స్‌వెల్ (12), గంభీర్ (4)లను ఔట్ చేసి పంజాబ్ పట్టు బిగించే ప్రయత్నం చేసింది. ముజీబ్ తన తొలి బంతికే పంత్ (4)ను క్లీన్ బౌల్డ్ చేయగా, రెండో పరుగు కోసం ప్రయత్నించి క్రిస్టియాన్ (6) రనౌట్ కావడంతో ఢిల్లీ పరిస్థితి దిగజారింది.
Comments
Please login to add a commentAdd a comment