అంపైర్ల చేతికి ‘ఆయుధం’
అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ ఆదివారం పంజాబ్, గుజరాత్ మ్యాచ్‌లో తన ఎడమ చేతికి ఒక పెద్ద పంకాలాంటి వస్తువును అంటి పెట్టుకొని బరిలోకి దిగడం చూశారా! ఇంజినీర్లు వాడే స్కేల్‌లా ఉన్న ఆ పరికరం ఇప్పుడు ఆయనకు రక్షణ కవచంలాంటిది. ధనాధన్ క్రికెట్‌లో బంతులు బౌండరీలు దాటడమే కాదు... కొన్నిసార్లు షాట్లు నేరుగా అంపైర్లపైకి కూడా దూసుకొస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం భారత దేశవాళీ క్రికెట్‌లో ఒక ఆసీస్ అంపైర్ కూడా గాయపడ్డాడు.
దాంతో ఆక్సెన్‌ఫోర్డ్ తనను తాను రక్షించుకునేందుకు ఇలాంటిది తీసుకొని మ్యాచ్‌కు వెళుతున్నారు. బంతి తనపైకి వస్తే సింపుల్‌గా రజినీకాంత్ లెవెల్లో ఒక చేతిని అడ్డుగా పెట్టేస్తే సరి! ఫైబర్‌తో తయారైన ఈ ‘గార్డ్’కు బలమైన బంతులను కూడా నిరోధించగల సామర్థ్యం ఉంది. మన ఆటగాళ్లు కొంతమంది ఆక్సెన్‌ఫోర్డ్‌పైకి సరదాగా బంతులు విసిరి మరీ దానిని పరీక్షించారట. ఇప్పటికే అంపైర్లు హెల్మెట్లు ధరిస్తుండగా, హిట్టర్ల దెబ్బనుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు అంపైర్ల చేతికి మరో ఆయుధం కొత్తగా చేరింది.