
కోహ్లీ, జాదవ్ సెంచరీలు
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియాను విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ ఆదుకుంటున్నారు.
పుణె: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియాను విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ ఆదుకున్నారు. కీలక సమయంలో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయగా, జాదవ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 63/4 స్కోరుతో కష్టాల్లోపడిన టీమిండియాను వీరిద్దరూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పి విజయం దిశగా నడిపించారు. కోహ్లీ (93 బంతుల్లో సెంచరీ)కిది వన్డేల్లో 27వ సెంచరీ కాగా, జాదవ్ (65 బంతుల్లో సెంచరీ)కిది రెండో శతకం. 36.3 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. స్టోక్స్ బౌలింగ్లో విరాట్ క్యాచవుటయ్యాడు.
351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్ రాహుల్ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్ బాల్ ఓవర్లో ధోనీ పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 12 ఓవర్లలో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ సమయంలో విరాట్, జాదవ్ ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు.