నీ సొమ్మేం పోతుంది కోహ్లి...
సాక్షి, హైదరాబాద్: ‘ఐదు రోజుల పాటు ఇక్కడ ప్రేక్షకుల స్పందన అద్భుతం. పెద్ద సంఖ్యలో అభిమానులు మా ఆటను చూసేందుకు ఇక్కడికి వచ్చారు. వారికి కావాల్సిన వినోదాన్ని మేం అందించాం’... అంటూ బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. అయితే చివరి రోజు తమ పట్ల అతను స్పందించిన తీరు మాత్రం సగటు అభిమానులను నిరాశకు గురి చేసింది. మ్యాచ్ గెలిచాక తిరిగి వస్తున్న సమయంలో సౌత్ స్టాండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ‘కోహ్లి... కోహ్లి... కోహ్లి’ అంటూ అరుస్తున్నా అతను కనీసం వారి వైపు కూడా తిరిగి చూడలేదు.
ప్రదానోత్సవం కోసం డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు, కార్యక్రమం అంతా అయిపోయాక తిరిగి వెళ్లేటప్పుడు కూడా అతనిది ఇదే తరహా స్పందన. కాస్త ఓ చిరునవ్వుతో బదులిచ్చి ఓ సారి చేయి ఊపినా అభిమానులకు అంతు లేని ఆనందం దక్కేది. విరామం లేకుండా అన్ని వైపుల నుంచి ఫ్యాన్స్ తన పేరు జపిస్తున్నా కానీ కృతజ్ఞతగానైనా ఒక్క క్షణకాలం పాటు కూడా కోహ్లి వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం కూడా చేయలేదు. గతంలో సచిన్, ధోనిలు కూడా ఇలా ఎప్పుడూ చేయలేదని, కోహ్లి మాత్రం అసలు పట్టించుకోలేదని అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం స్టేడియానికి హాజరైన ప్రేక్షకుల సంఖ్య 9,520.