కోహ్లి మళ్ళీ అభిమానుల మనసుల్ని గెలిచాడు..! | Kohli's Kind Gesture Won Hearts On The Internet | Sakshi
Sakshi News home page

కోహ్లి మళ్ళీ అభిమానుల మనసుల్ని గెలిచాడు..!

Published Sun, Nov 17 2019 10:57 AM | Last Updated on Sun, Nov 17 2019 11:06 AM

Kohli's Kind Gesture Won Hearts On The Internet - Sakshi

ఇండోర్‌: ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అభిమానులు విశేషంగా ఉన్నారనేది వాస్తవం. కోహ్లితో మాట్లాడాలని, తాకాలని మ్యాచ్‌ చూసేందుకు వచ్చే అభిమానులు పరితపించి పోతుంటారు. భారత్‌-బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లితో మాట్లాడి కరాచలనం చేసేందుకు ఓ అభిమాని తెగ ఉత్సాహం చూపించాడు. బాగా ఎత్తుగా ఉన్న బారికేడ్లను సైతం లెక్కచేయలేదు. అమాంతం వాటిని దూకేసి మైదానంలో వేగంగా దూసుకుపోయాడు. మ్యాచ్‌ మధ్యలో వచ్చిన బ్రేక్‌తో ఆటగాళ్లు, అంపైర్లు మాట్లాడుకుంటుండగా ఆ అభిమాని కోహ్లి దగ్గరకు ఆగమేఘాల మీద వచ్చేశాడు.  

రెప్పపాటులో భారత ఆటగాళ్ల దగ్గరకు వచ్చేసి మధ్యలో దూరేశాడు. దాంతో ఇషాంత్‌ శర్మ కాస్త కంగారు పడినప్పటికీ ఆ అభిమానిని కోహ్లి వారించాడు. ఆ అభిమానితో మాట్లాడమే కాకుండా భుజంపై చేయి వేసి ప్రేక్షకుల గ్యాలరీలోకి వెళ్లిపొమ్మాన్నాడు. ఈలోపు భద్రతా సిబ్బంది పరుగు పరుగున మైదానంలోకి వచ్చి ఆ అభిమాని పట్టుకునే యత్నం చేశారు. కాగా, కోహ్లి మాత్రం సదరు అభిమానిని ఏమీ చేయవద్దని అధికారులకు సూచించాడు. ఒకవేళ కోహ్లి అలా చెప్పకుండా ఉంటే ఆ అభిమాని చేసిన పనికి బడిత బాజా అయ్యేది. సెక్యూరిటీ సిబ్బంది మ్యాచ్‌లో మునిగిపోయిన సమయంలో అభిమాని అలా చేయడం అక్కడ కాస్త కలకలం రేపింది. 

కాగా, కోహ్లి మాత్రం అభిమానుల  మనసుల్ని మళ్లీ గెలిచాడు. ఆ అభిమాని భుజంపై చేయివేసి మరీ తీసుకొచ్చి సెక్యూరూటీ సిబ్బందికి అ‍ప్పగించడమే కాకుండా అతన్ని ఏమీ చేయవద్దని చెప్పడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘దటీజ్‌ కోహ్లి.. ఆటలోనే కాదు.. తన పనులతోనూ టీమిండియా కెప్టెన్‌ ఆకర్షిస్తన్నాడు’ అని సోషల్‌ మీడియాలో అభిమానులు కొనియాడుతున్నారు.గతంలో ఇలానే జరిగితే భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ భద్రతా సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌లు ఫ్రీగా చూడటానికే సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నట్లు కనబడుతుందని దుయ్యబట్టాడు. ప్రధానంగా భారత్‌లోనే ఇలా జరుగుతుందని విమర్శించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement