చాంపియన్ కోటేశ్వర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన కుర్రాళ్లు సత్తా చాటారు. హుస్సేన్ సాగర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో పతకాలతో మెరిశారు. తెలంగాణకు చెందిన సెయిలర్లు కోటేశ్వర్ రావు, ఎం. సాయిబాబా, కె. గౌతమ్ జూనియర్స్ లేజర్ 4.7 విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచి వరుసగా పసిడి, రజతం, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఓపెన్ లేజర్ 4.7 విభాగంలోనూ కోటేశ్వర్ రావు రాణించాడు. మొత్తం 69 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించాడు.
ఈ విభాగంలో మధ్య ప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ (26 పాయింట్లు) విజేతగా నిలవగా, తమిళనాడు సెయిలర్ చిత్రేశ్ (63 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. సీనియర్ లేజర్ స్టాండర్డ్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన అజయ్‌సింగ్ రాజ్‌పుత్ 19 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అవినాశ్ యాదవ్ (మహారాష్ట్ర, 30 పాయింట్లు), లిమ్ జాన్ (కర్ణాటక, 33 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన సెయిలర్ జూహి దేశాయ్ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలికల చాంపియన్‌గా నిలిచింది. ఆమె మొత్తం 145 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నీలో 6 రాష్ట్రాలకు చెందిన 45 మంది సెయిలర్లు పాల్గొన్నారు.