
సాక్షి, హైదరాబాద్: భారత టేబుల్ టెన్నిస్‌లో మరో కొత్త సంచలనం దూసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ ఇటీవల జాతీయ యూత్ ర్యాంకింగ్ టీటీ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ అమ్మాయి అయిన శ్రీజ గత కొన్నేళ్లుగా సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా రెండు టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న 20 ఏళ్ల శ్రీజ మరో మెట్టు ఎక్కి సీనియర్ విభాగంలోనూ చెలరేగాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కొత్తగా సీనియర్ ప్రొ టూర్‌కు సన్నద్ధమవుతోంది.
నాన్న అండగా...
శారీరకంగా చూస్తే సన్నగా, సాధారణ ఎత్తుతో కనిపించే ఈ అమ్మాయిని చూసి ఆమె ఆటను అంచనా వేస్తే పొరబడినట్లే. ఒక్కసారి టీటీ టేబుల్ వద్దకు చేరిందంటే ఆమె ఆటలో అప్రయత్నంగానే వేగం, దూకుడు వచ్చేస్తాయి. ఇదే తరహా శైలి శ్రీజకు వరుస విజయాలు అందించింది. టేబుల్ టెన్నిస్‌ను ఇష్టపడే తండ్రి ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో, అక్క రవళి ఆటను చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో ఆమె టీటీలో బలంగా తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ముందుగా ఎనిమిదేళ్ల వయసులో సెయింట్ పాల్స్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న శ్రీజ ఆటకు కోచ్ సోమనాథ్ ఘోష్ ఆ తర్వాత గ్లోబల్ అకాడమీలో మరింత మెరుగులు దిద్దారు. ఈ క్రమంలో 11 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న ఈ ప్యాడ్లర్ ఆ తర్వాత దూసుకుపోయింది. వేర్వేరు వయో విభాగాల్లో నాలుగు సార్లు టైటిల్స్ సాధించిన శ్రీజ, మరో ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది.
అంతర్జాతీయ స్థాయిలోనూ...
దాదాపు రెండేళ్ల క్రితం అండర్–18 స్థాయిలో సాధించిన రెండు అంతర్జాతీయ విజయాలు శ్రీజలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఎల్ సాల్వడార్‌లో, ఇరాన్‌లో జరిగిన ఫజర్ కప్ టోర్నీలలో శ్రీజ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇండియా ఓపెన్‌లో కాంస్యం సాధించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ప్రి క్వార్టర్ వరకు చేరడం శ్రీజ అత్యుత్తమ ప్రదర్శన. అయితే ర్యాంకింగ్ టోర్నీలో తనకంటే ఎంతో సీనియర్లు అయిన భారత స్టార్లు మనికా బాత్రా, మౌసమీ పాల్, మధురిక పట్కర్‌లపై గెలుపొంది ఆమె తన సత్తా చాటుకుంది. ఎప్పుడో ఒకసారి కాకుండా ఈ తరహా విజయాలు నిలకడగా సాధిస్తేనే తన కెరీర్‌లో ముందుకు వెళ్లగలనని శ్రీజ నమ్ముతోంది.
కొత్త లక్ష్యాలతో...
టీటీతో పాటు పాఠశాల స్థాయి నుంచి చదువులో కూడా చురుగ్గా ఉండే శ్రీజ ప్రస్తుతం దూరవిద్యలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమెకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వడంతో ఆర్థికపరంగా కొంత వెసులుబాటు లభించింది. దిండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి (ఎంఎల్‌ఆర్) కళాశాలకు చెందిన టీటీ అకాడమీలో, మెరీడియన్ స్కూల్‌లో ఆమె ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్ ఘోష్ ప్రకారం శ్రీజ బలం ఆమె ఫోర్ హ్యాండ్, టాప్ స్పిన్. అయితే సర్వీస్‌ను రిటర్న్ చేయడంలో ఉన్న కొంత బలహీనతను ఆమె సాధనతో అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. సీనియర్ విభాగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న శ్రీజ, వచ్చే నెలలో నైజీరియా ఓపెన్‌లో పాల్గొనబోతోంది. సీనియర్ ప్రొ టూర్‌లో భాగంగా ఇది ఆమె తొలి టోర్నీ కావడంతో విజయం కోసం పట్టుదలగా శ్రమిస్తోంది.
నా కెరీర్‌లో ఇది కీలక దశ. సీనియర్ స్థాయిలో మంచి విజయాలు సాధిస్తేనే నా ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లలో అవకాశం దక్కాలంటే నా ప్రపంచ ర్యాంక్ మెరుగ్గా ఉండాలి. అందు కోసం వరుసగా టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం టాప్–16లో ఉన్నవారినే ఎంపిక చేసిన కొన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది. మిగతా వాటికి సొంత డబ్బులతోనే వెళ్లాలి. అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనాలంటే దాదాపు రూ. 2 లక్షలు ఖర్చవుతాయి. ఆర్థికపరంగా ఇది చాలా భారం. ఆర్‌బీఐ ద్వారా ఉద్యోగ భద్రత ఉన్నా నాకు స్పాన్సర్ ఎవరూ లేరు. ఈ స్థితిలో కార్పొరేట్ కంపెనీలు గానీ, ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ లేదా గో స్పోర్ట్స్‌లాంటి సంస్థలు నాకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌గారిని కూడా కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేశాను. ఇప్పటి వరకు జూనియర్ స్థాయిలో మెరుగ్గా రాణించిన నా ప్రదర్శనకు స్పాన్సర్ల సహకారం లభిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించగలనని నమ్ముతున్నా.
–ఆకుల శ్రీజ
Comments
Please login to add a commentAdd a comment