
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ ఆదివారం అరెస్టయ్యాడు. ప్రమాదవశాత్తు తన కారుతో ఓ సైక్లిస్టును ఢీకొట్టిన కుశాల్ మెండిస్ అతని మరణానికీ కారణమయ్యాడు. దీంతో అతని ఎస్‌యూవీ వాహనంతో పాటు మెండిస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కొలంబోలోని పనదురా ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో గోకరెలా ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మెండిస్ మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అనే అంశంపై స్పష్టత రాలేదు. 25 ఏళ్ల మెండిస్ ఇప్పటి వరకు శ్రీలంక జట్టుకు 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment