హైదరాబాద్: అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)దే అగ్రస్థానం. ఇందులో కనీసం కొన్ని మ్యాచ్‌లైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. లీగ్‌లో ఒక్కసారి అద్భుతంగా రాణిస్తే తమ జీవితమే మారిపోతుందని భావిస్తుంటారు. ఇక్కడ ఆటగాళ్లకున్న క్రేజ్ ఆధారంగా ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. ఇక లీగ్‌కు అభిమానుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాదిపాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతని స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాను తీసుకోవాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావించింది. దీనిలో భాగంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పెరీరాను సంప్రదించగా ఐపీఎల్‌లో ఆడేందుకు తాను సిద్ధంగాలేనని సన్‌రైజర్స్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిసింది. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నమెంట్లో రాణించి తిరిగి లంక టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని కుశాల్ ఆశిస్తున్నాడట. దాంతో వచ్చిన ఐపీఎల్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు లంక జర్నలిస్టు డానియల్ అలెగ్జాండర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరోవైపు నిషేధాన్ని ఎదుర్కొన్న స్టీవ్‌స్మిత్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బీసీసీఐకి లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment