ఈసారి డబుల్‌ సెంచరీ బాదేశాడు..! | Labuschagne Hits Maiden Test Double Hundred | Sakshi
Sakshi News home page

ఈసారి డబుల్‌ సెంచరీ బాదేశాడు..!

Published Sat, Jan 4 2020 10:33 AM | Last Updated on Sat, Jan 4 2020 10:42 AM

Labuschagne Hits Maiden Test Double Hundred - Sakshi

సిడ్నీ:  గతేడాది హ్యాట్రిక్‌ టెస్టు సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌.. ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్‌ సెంచరీ బాదేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొలి రోజు ఆటలో సెంచరీతో అజేయంగా నిలిచిన లబూషేన్‌.. రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. 130 పరుగుల వ్యక్తిగత స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన లబూషేన్‌ డబుల్‌ సెంచరీ సాధించి ఆ ముచ్చట తీర్చుకున్నాడు. గతేడాది వరుసగా మూడు టెస్టు సెంచరీలు సాధించడంతో పాటు ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచిన లబూషేన్‌.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.(ఇక్కడ చదవండి: 2020లో తొలి సెంచరీ)

 283/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌.. మరో ఐదు పరుగులు జత చేసిన తర్వాత మాథ్యవేడ్‌(22) వికెట్‌ను కోల్పోయింది. ఆపై ట్రావిస్‌ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు లబూషేన్‌. కాకపోతే హెడ్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఆసీస్‌ స్కోరు 331 పరుగుల వద్ద హెడ్‌(10) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత కెప్టెన్‌ టిమ్‌ పైన్‌పై పడింది . ఈ క్రమంలోనే లబూషేన్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఏడాది డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా కూడా లబూషేన్‌ రికార్డు నెలకొల్పాడు. లబూషేన్‌తో కలిసి 79 పరుగులు జత చేసిన తర్వాత పైన్‌(35) ఔటయ్యాడు.  డబుల్‌ సెంచరీ సాధించిన కాసేపటికి లబూషేన్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. 363 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌తో 215 పరుగులు చేసిన లబూషేన్‌ ఏడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. చివర్లో మిచెల్‌ స్టార్క్‌(22) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆసీస్‌ 454 పరుగులు చేసింది.

భారీ శతకాల మోత..
లార్డ్స్‌ మైదానంలో యాషెస్‌ రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ గాయపడటంతో లబూషేన్‌ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీతో మెరిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. దాంతో స్మిత్‌ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్‌ రెగ్యులర్‌ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు లబూషేన్‌. ఇటీవల పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. అదే జోరును కొనసాగిస్తూ న్యూజలాండ్‌తో పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారీ శతకం నమోదు చేశాడు.

 240 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 1 సిక్స్‌తో  143 పరుగులు చేశాడు.  అంతకుముందు పాకిస్తాన్‌ జరిగిన రెండు వరుస టెస్టుల్లో లబూషేన్‌ 162, 185 పరుగులు చేశాడు. దాంతో హ్యాటిక్‌ సెంచరీల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూడు భారీ శతకాలే అయినప్పటికీ వాటిని డబుల్‌ సెంచరీగా మార్చుకోవడంలో లబూషేన్‌ విఫలమయ్యాడు. దాన్ని కివీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే తీర్చుకున్నాడు లబూషేన్‌. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన లబూషేన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఆపై రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు సాధించాడు.(ఇక్కడ చదవండి: తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ క్రికెటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement