ఎనిమిది అంశాల్లో మోడి దోషి
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడిని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఎనిమిది అంశాల్లో దోషిగా తేల్చింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడడమే కాకుండా ఫ్రాంచైజీలతో అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొంది. పరిపాలనా వ్యవహారాల్లోనూ ఎవరినీ లెక్కచేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్టు అరుణ్ జైట్లీ, జ్యోతిరాదిత్య సింధియా, చిరాయు అమీన్ నేతృత్వంలోని కమిటీ తమ 134 పేజీల నివేదికలో పేర్కొంది. ఈనెల 25న జరిగే బీసీసీఐ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లో మోడిపై జీవిత కాల బహిష్కరణ విధించే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికపై మోడి విరుచుకుపడ్డారు. జైట్లీ శ్రీనివాసన్ మనిషని, తానంటే వ్యతిరేకత చూపుతాడని ఆరోపించారు. ఓ జట్టు యజమానిగా శ్రీనివాసన్ ఉన్నా కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
మోడిపై కమిటీ మోపిన అభియోగాలను పరిశీలిస్తే...
2010లో కొత్త ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ టెండర్ల ఆహ్వానం కోసం ముసాయిదా తయారుచేసింది. దీంట్లో బోర్డుకు తెలియకుండానే మోడి అసాధ్యమైన నిబంధనను చేర్చారు. బిడ్డర్ ఎవరైనా వారి ఆస్తుల విలువ ఒక బిలియన్ డాలర్లుండాలి. అలాగే బ్యాంకు గ్యారెంటీ కింద రూ.460 కోట్లు చూపాలి. అయితే బీసీసీఐ వర్గాల ప్రకారం ఐపీఎల్ పాలక మండలి ఆమోదం పొందిన ముసాయిదాలో ఈ నిబంధనలు లేవు. తుది డ్యాక్యుమెంట్‌లో మోడి చేర్చారు. అయితే అప్పటి బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు ఈ విషయం చెప్పానని మోడి వాదన. ఇదంతా ఇద్దరు బిడ్డర్ల కోసం చేశాడని ప్యానెల్ ఆరోపించింది.
2010లో కొత్తగా ఐపీఎల్‌లో చేరిన పుణే, కొచ్చి టస్కర్స్‌పై మోడి వ్యతిరేకత చూపించారు. తమ హక్కులను కోల్పోవాల్సిందిగా లేకుంటే వివిధ కఠిన నిబంధనలు విధించి ఇబ్బందిపెడతానని కొచ్చి ప్రతినిధిని మోడి బెదిరించారు.
అలాగే ఐపీఎల్ టీవీ ప్రసార, ఇంటర్‌నెట్ హక్కుల విషయంలో, ఇంగ్లండ్‌లోని క్లబ్బులతో కలిసి రెబల్ లీగ్‌కు ఏర్పాటు తదితర అంశాల్లో మోడిపై ఆరోపణలను మోపింది.