
ఆంటిగ్వా: ఆసీస్ మహిళా క్రికెట్ కెప్టెన్ మెగ్ లానింగ్ మరో రికార్డు సాధించారు. వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ సెంచరీ సాధించి ఆసీస్ భారీ విజయంలో పాలు పంచుకున్నారు. విండీస్‌పై చెలరేగిపోయిన మెగ్ లానింగ్ 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు సాధించారు. ఇది మెగ్ లానింగ్‌క 13వ వన్డే సెంచరీ. తద్వారా వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 13వ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా మెగ్ లానింగ్ రికార్డు సృష్టించారు. మెగ్ లానింగ్ 76 ఇన్నింగ్స్‌ల్లోనే 13వ వన్డే సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. మహిళల క్రికెటే కాకండా పురుషుల క్రికెట్ పరంగా చూసిన ఇదే అత్యుత్తమం.
గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా 83 ఇన్నింగ్స్‌లో 13వ సెంచరీ మార్కును చేరి ఆ రికార్డును తన పేరిట లిఖించుకోగా, దాన్ని మెగ్ లానింగ్ బ్రేక్ చేశారు. మహిళల టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా లానింగ్ పేరిటే ఉంది. ఈ జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో లానింగ్ 133 పరుగులు చేశారు. దాంతో తన పాత రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నారు.
విండీస్ మహిళలతో తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేశారు. మెగ్ లానింగ్ సెంచరీకి తోడు అలైసా హీలే(122) శతకం సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఆపై 309 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్ 178 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 37.3 ఓవర్లలో విండీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులే చేసింది. చివరి వరసు బ్యాట్స్‌వుమెన్ కైసియా నైట్ ఆబ్సెంట్ హార్ట్‌గా ఫీల్డ్‌లోకి రాలేదు.