లసిత్ మలింగ
పుష్కర కాలం క్రితం 2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లుతీసి అరుదైన సంచలనాన్ని నమోదు చేశాడు. ‘హ్యాట్రిక్’తోనే సరిపెట్టకుండా తర్వాతి బంతికి మరో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకొని అద్భుతం చేసి చూపించాడు. ఇప్పుడు అదే ఫీట్‌ను అతను పునరావృతం చేశాడు. ఈసారి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో తన సత్తా చూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసి మరెవరికీ సాధ్యం కాని రీతిలో చరిత్రకెక్కాడు. మలింగ దెబ్బకు కివీస్ చిత్తుగా ఓడగా... సొంతగడ్డపై తన కెప్టెన్సీలో సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా అతను కాపాడుకోగలిగాడు.
పల్లెకెలె: న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే టి20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక మూడో మ్యాచ్‌లో కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసి మరో ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి 2 ఓవర్లలో కివీస్ 15 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోవచ్చని అనిపించిన సమయంలో అసలు తుఫాన్ మొదలైంది. మూడో ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులు ఇవ్వని మలింగ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 4 బంతుల్లో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మలింగ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్ కూడా వెనుదిరగడంతో అతని బౌలింగ్ విశ్లేషణ 5/5గా నిలిచింది. ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ వేసి మరో పరుగు ఇచ్చిన మలింగ మ్యాచ్‌ను 4–1–6–5తో ముగించాడు. కివీస్ 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
4 వికెట్లు పడ్డాయిలా...
2.3: మున్రో (బి) మలింగ
2.4: రూథర్‌ఫోర్డ్ (ఎల్బీ) మలింగ– రివ్యూలోనూ అవుట్
2.5: గ్రాండ్‌హోమ్ (బి) మలింగ – హ్యాట్రిక్ పూర్తి
2.6: టేలర్ (ఎల్బీ) మలింగ
పాపం రూథర్‌ఫోర్డ్...
కివీస్ ప్లేయర్ హామిష్ రూథర్‌ఫోర్డ్ 2013లో ఇదే మైదానంలో తన చివరి టి20 మ్యాచ్ ఆడాడు. మూడో మ్యాచ్‌కు ముందు గప్టిల్ గాయపడటంతో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న అతడిని హడావిడిగా బుధవారమే జట్టులోకి ఎంపిక చేశా రు. అదే రోజు సాయంత్రం బయల్దేరి దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి బరిలోకి దిగిన రూథర్‌ఫోర్డ్ తొలి బంతికే అవుటయ్యాడు పాపం.
5: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ మలింగ. అతను వన్డేల్లో 3, టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు సాధించాడు.
1: అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్ మలింగ (మొత్తం 104)
100: అన్ని ఫార్మాట్‌లు కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 100వ హ్యాట్రిక్
2: టి20ల్లో మలింగకు ముందు రషీద్ ఖాన్ (అఫ్గాన్) కూడా 4 బంతుల్లో 4 వికెట్లు (ఐర్లాండ్‌పై) తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment