హామిల్టన్‌దే విజయం
మూడోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సిల్వర్‌స్టోన్ (ఇం గ్లండ్): ప్రతికూల పరిస్థితులను అధిగమించిన లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మూడోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 31 నిమిషాల 27.729 సెకన్లలో పూర్తి చేశాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ మొదట్లో అనూహ్యంగా వెనుకబడ్డాడు. 18 ల్యాప్‌ల వరకు ఫెలిప్ మసా ఆధిక్యంలో ఉండగా... ఆ తర్వాత హామిల్టన్ ఆధిక్యంలోకి వచ్చాడు. అక్కడి నుంచి ఈ బ్రిటన్ డ్రైవర్ వెనుదిరిగి చూడలేదు. మధ్యలో భారీ వర్షం వచ్చినా... తన సహచరుడు రోస్‌బర్గ్ నుంచి గట్టిపోటీ ఎదురైనా అన్నింటిని అధిగమించి హామిల్టన్ అందరికంటే ముందు గమ్యానికి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఐదో విజయం కావడం విశేషం.
డేవిడ్ కూల్ట్‌హర్డ్ (1999, 2000లో) తర్వాత బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వరుసగా రెండేళ్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2008లో ఈ టైటిల్‌ను నెగ్గాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది.