బీసీసీఐ సమూల ప్రక్షాళన | Lodha Committee Report: Winds of change set to sweep the BCCI | Sakshi
Sakshi News home page

బీసీసీఐ సమూల ప్రక్షాళన

Published Tue, Jan 5 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

బీసీసీఐ సమూల ప్రక్షాళన

బీసీసీఐ సమూల ప్రక్షాళన

బీసీసీఐలో మార్పులకు లోధా కమిటీ ప్రతిపాదనలు
సుప్రీం కోర్టు చేతుల్లో తుది నిర్ణయం
అమల్లోకి వస్తే ప్రస్తుత పెద్దలంతా అవుట్


 భారత క్రికెట్ నియంత్రణ మండలి పుట్టిన దగ్గరినుంచి నియంత్రణ లేకుండా సాగుతున్న పరిపాలనకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుందా... తాము ‘ఆడించిందే’ ఆట అన్నట్లుగా బోర్డులో సుదీర్ఘంగా పాతుకుపోయిన పెద్దలకు చెక్ చెప్పే సమయం ఆసన్నమైందా... మేం రాసుకుందే రాజ్యాంగం, ప్రభుత్వానికి కూడా మేం జవాబుదారీ కాదు అన్నట్లుగా వ్యవహరించే క్రికెట్ అడ్డా... ఇకపై అడ్డగోలుగా వ్యవహరించకుండా బంధనాలు రాబోతున్నాయా..? ఐపీఎల్‌లో ఫిక్సింగ్, బెట్టింగ్‌తో మొదలైన వివాదానికి క్లైమాక్స్‌గా జస్టిస్ లోధా కమిటీ భారీ నివేదిక ఇచ్చింది. పలు మార్పులు సూచిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఇది అమల్లోకి వస్తుందా? రాదా? అనేది సుప్రీం కోర్టు చేతుల్లో ఉంది.
 
 న్యూఢిల్లీ: బీసీసీఐలో సమూల ప్రక్షాళనకు సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బోర్డులో మార్పులతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును  దృష్టిలో ఉంచుకొని అనేక ప్రతిపాదనలు చేసింది. ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి పరిమితులు విధించడం మొదలు రాష్ట్ర సంఘాల్లో ఓటింగ్ హక్కు, సెలక్షన్ కమిటీ ఎంపిక, బోర్డును ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకు రావడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని సూచించడం కూడా కమిటీనుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది.

జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్. రవీంద్రన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్‌లో చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు, మెయప్పన్, రాజ్ కుంద్రాలకు శిక్షలు ప్రతిపాదించడంతో పాటు బీసీసీఐ పనితీరుపై తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కమిటీని కోరింది. తాజా నివేదికను కమిటీ సుప్రీంకే సమర్పిస్తుంది. ఇందులోని చాలా అంశాలు ప్రస్తుతం సాగుతున్న పరిపాలనా శైలికి ముగింపు పలికే విధంగానే ఉన్నాయి. కమిటీ చేసిన ప్రతిపాదనలు అవి అమల్లోకి వస్తే పడే ప్రభావం ఏమిటో చూద్దాం....
 

  •  1 ప్రతిపాదన: 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదు.
    ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శరద్‌పవార్ (75 ఏళ్లు), శ్రీనివాసన్ (71), నిరంజన్ షా (71)లతో పాటు పాండోవ్, ఐఎస్ బింద్రా లాంటి అనేకమంది క్రికెట్  పరిపాలనకు దూరమవుతారు.
     
  •  2  ప్రతిపాదన : ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే. 
    ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శశాంక్ మనోహర్ కనీసం బీసీసీఐ సమావేశంలో ఓటు వేయలేరు. మహారాష్ట్ర సంఘానికి మాత్రమే ఓటు ఉంటుంది. విదర్భ, ముంబై సంఘాలు నామమాత్రంగా మారిపోతాయి. ఇలాగే గుజరాత్‌లోనూ జరుగుతుంది. నగరం ఆధారంగా ఉన్న సంఘాలు పోయి చత్తీస్‌గఢ్, తెలంగాణ, బీహార్‌లకు ఓటు హక్కువస్తుంది.

     
  •  3 ప్రతిపాదన: ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలి. అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలి.
    ప్రభావం: అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బోర్డు కార్యదర్శి. తన పదవీకాలం పూర్తి కాగానే తిరిగి అధ్యక్ష పదవికో, కార్యదర్శి పదవికో పోటీ చేయలేరు. మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది.

     
  •  4.ప్రతిపాదన: బీసీసీఐ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే (మూడేళ్ల చొప్పున) పదవిలో ఉండాలి. ఆ త ర్వాత మరే పదవిలోనూ ఉండకూడదు.
    ప్రభావం: శశాంక్ మనోహర్ ప్రస్తుత పదవీకాలం ముగిస్తే ఆరేళ్లు
    పూర్తవుతుంది. ఇక ఆ యన  బీసీసీఐలో ఎలాంటి  పదవిలోనూ ఉండరు.
     
  •   5.ప్రతిపాదన: ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదు. 
    ప్రభావం: ప్రస్తుతం బీసీసీఐలో ఉన్న పెద్దలంతా తమ రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు. వారంతా ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

     
  •  6.ప్రతిపాదన: సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. వాళ్లు కూడా కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడినవారై ఉండాలి.
    ప్రభావం: ప్రస్తుత సెలక్టర్లలో ఖోడా కేవలం వన్డేలు ఆడాడు. కాబట్టి తను అనర్హుడు. అలాగే రాథోడ్, సాబా కరీమ్, ఎమ్మెస్కే ప్రసాద్, సందీప్ పాటిల్ (చైర్మన్)లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది.
     
  •  7.ప్రతిపాదన: బెట్టింగ్‌ను చట్టబద్దం చేయడం
    ప్రభావం: విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లండ్‌లోని ప్రముఖ బెట్టింగ్ కంపెనీలు భారత్‌లోనూ తమ కార్యకలాపాలు చేపడతాయి.
     
  •  8. ప్రతిపాదన: బోర్డును ఆర్టీఐ  పరిధిలోకి తేవాలి.
    ప్రభావం: ఇకపై సామాన్యులు కూడా  బీసీసీఐ వ్యవహారాలను, చెల్లింపులను  తెలుసుకోవచ్చు.
     

 ఏం జరుగుతుంది?
 లోధా కమిటీ ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే చేసి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇవన్నీ కచ్చితంగా అమలు కావాలని నిబంధన ఏమీ లేదు. ముందుగా ఈ నివేదికపై సుప్రీంకోర్టు బీసీసీఐ అభిప్రాయాన్ని కోరుతుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి బోర్డు తరఫున వివరణ ఇచ్చుకునే అవకాశం ఇస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే బోర్డు పెద్దలకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా వయో పరిమితి, రెండు సార్లు ఎన్నిక కావడానికి మధ్య విరామం ఇవ్వాలనే అంశాలే బోర్డు పెద్దలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
 
  దీనిపై బోర్డు గట్టిగా వాదించే అవకాశం ఉంది. ‘నివేదికను పూర్తిగా చదివిన తర్వాతే నా అభిప్రాయం చెబుతాను’ అని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వెల్లడించారు. అయితే శరద్‌పవార్‌లాంటి వారు ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, 70 ఏళ్లు దాటారని పని చేయకూడదా అని ఒక బోర్డు సభ్యుడు ప్రశ్నిస్తే... బాగా పని చేసినప్పుడు వరుసగా ఎన్నిక కాకుండా ఎందుకు నిరోధించాలని మరొకరు అడుగుతున్నారు. అన్నింటికి మించి ముగ్గురు సెలక్టర్లు 27 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను ఎలా చూడగలరనేది మరొకరి సందేహం. మొత్తానికి సుప్రీం కోర్టులో బీసీసీఐ ఎలాంటి వాదన వినిపిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు తన వాదనలు వినిపించి సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేయడానికి బాగానే సమయం పట్టొచ్చు.
 
 మరికొన్ని ప్రతిపాదనలు...
  ♦ బోర్డు అధ్యక్ష పదవిని  రొటేషన్ పద్ధతిలో ఒక్కో జోన్‌కు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని తొలగించాలి. బోర్డు ఎన్నికల సమయంలో అధ్యక్షుడికి ఇప్పుడు మూడు ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి తప్పించాలి.
 
  ♦రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించించేందుకు సీఈఓను నియమించాలి. ఆటగాళ్ల తరఫున మాట్లాడేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ప్లేయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. 9 మంది సభ్యులతో అపెక్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి ఒక మహిళ సహా ముగ్గురు ఆటగాళ్లు అందులో సభ్యులుగా ఉండాలి.

  ♦ 9 మంది సభ్యులతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను విస్తరించి అందులో ఇద్దరు ఫ్రాంచైజీల తరఫున, ఒకరు ప్లేయర్స్ అసోసియేషన్ తరఫున ఉండేలా చూడాలి. మరొకరు ప్రభుత్వ ప్రతినిధిగా ‘కాగ్’ నామినేట్ చేసిన వ్యక్తిని నియమించాలి.
 ♦  ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’పై దృష్టి పెట్టేందుకు ఒక నైతిక విలువల అధికారిని నియమించాలి.
 
 సుందర్ రామన్‌కు క్లీన్ చిట్
 బుకీలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎల్ మాజీ  సీఓఓ సుందర్ రామన్‌కు కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చింది. అతడిని దోషిగా తేల్చేందుకు ఎలాంటి ఆధారం లభించలేదని కమిటీ పేర్కొంది. అతనిపై వచ్చిన ఏడు రకాల ఆరోపణల్లో ఒక్కదాంట్లోనూ బలం లేదని, కాబట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది.

 
 త్వరలో బోర్డు ఎస్‌జీఎం
 న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు వారాల్లోపే ఎస్‌జీఎంను సమావేశపరచాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం కోసం నేడు (మంగళవారం) ఉన్నతాధికారులంతా ముంబైకి రానున్నారు. ఇక్కడే ఎస్‌జీఎం ఎప్పుడనేది తేలనుంది. నివేదికలోని కొన్ని అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. మరోవైపు ఈ రిపోర్టుపై బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పందించేందుకు నిరాకరించారు.
 
 ఒక్కడే  652 నాటౌట్!
 స్కూల్ కుర్రాడి ప్రపంచరికార్డు
 ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సృష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
 
 ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. మైనర్ క్రికెట్‌లో ఈ రికార్డు నమోదు చేసినా... ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పృథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement