బీసీసీఐ ‘పెద్ద’లను వెంటనే తప్పించండి!
సుప్రీం ముంగిట లోధా కమిటీ కొత్త ప్రతిపాదన
బోర్డుకు పరిశీలకుడిని నియమించాలని సూచన
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు అమలు చేయలేక ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మరో పిడుగు పడింది. తాము నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో కొనసాగుతున్న బోర్డు ఆఫీస్ బేరర్లు అందరినీ వెంటనే తొలగించాలంటూ కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర సంఘాల్లోనూ కూడా దీనిని అమలు చేస్తూ అక్కడివారిని కూడా అనర్హులుగా ప్రకటించాలని కమిటీ సూచించింది. సిఫారసుల అమలుపై తాజా పరిస్థితిని వివరిస్తూ లోధా కమిటీ సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో ఈ ప్రతిపాదనలు చేసింది. ఇది కమిటీ సమర్పించిన మూడో నివేదిక కావడం విశేషం. లోధా ప్రతిపాదనల ప్రకారం ఆఫీస్ బేరర్ల వయసు 70 ఏళ్లకు మించరాదు, మంత్రిగానీ, ప్రభుత్వ అధికారిగానీ అరుు ఉండరాదు.
ఇతర సంఘాల్లో అధికారిగా పని చేయకూడదు. దీంతో పాటు మొత్తంగా కలిపి 9 ఏళ్లకు మించి ఏదైనా పదవిలో కొనసాగరాదనేది నిబంధన. వీటిని వర్తింపజేస్తే ప్రస్తుత అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే సహా బోర్డులోని ఆఫీస్ బేరర్లంతా అనర్హులవుతారు. తాము లోధా సిఫారసులు అమలు చేస్తామంటూ ఇప్పటికి నాలుగు రాష్ట్ర సంఘాలు (విదర్భ, త్రిపుర, రాజస్థాన్, హైదరాబాద్) మాత్రమే అంగీకారం తెలిపారుు. అరుుతే అక్టోబర్ 1న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.
పరిశీలకుడిగా జీకే పిళ్లై...
బీసీసీఐ ఇప్పటికీ తమ సూచనలను పట్టించుకోవడం లేదని తాజా నివేదికలో కూడా వెల్లడించిన లోధా కమిటీ... బోర్డుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఒక కంట కనిపెట్టేందుకు కొత్తగా పరిశీలకుడిని నియమించాలని కోరింది. ఇందు కోసం హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై పేరును కూడా ప్రతిపాదించింది. బోర్డుకు తగిన విధంగా మార్గనిర్దేశనం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు, టోర్నీలకు వివిధ కాంట్రాక్ట్‌లు ఇచ్చే విషయంలో పారదర్శకత కోసం పరిశీలకుడి అవసరం ఉందని కమిటీ పేర్కొంది. బీసీసీఐ రోజువారీ వ్యవహారాలను ఇప్పటికే సీఈఓ రాహుల్ జోహ్రి చూస్తున్నారు. అరుుతే ఆయన అధికారాలు పరిమితంగా ఉండటంతో పాటు బోర్డు కార్యదర్శి పర్యవేక్షణలో పని చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే కొత్తగా స్వతంత్ర పరిశీలకుడి అవసరం ఉన్నట్లు లోధా కమిటీ గుర్తించింది.