కేంద్రం, బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్త పరిపాలకుల పేర్లను సూచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈనెల 27న సీల్డ్ కవర్‌లో వీటిని తమకు అందించాలని కోరింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బోర్డు ఎన్నికలు జరిగి నూతన పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఈ తాత్కాలిక కమిటీ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని కోర్టు పేర్కొంది. అలాగే వచ్చేనెల మొదటి వారంలో జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ప్రతినిధుల పేర్లను సూచించాల్సిందిగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బీసీసీఐని కోరింది. అంతకుముందు అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం తొమ్మిది మందితో కూడిన పరిపాలకుల జాబితాను సీల్డ్ కవర్‌లో అందించారు. అయితే 70 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు కమిటీలో చోటు కల్పించకూడదని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తాము కూడా వ్యక్తుల పేర్లను సూచిస్తామని బీసీసీఐ కోరడంతో కోర్టు అంగీకరించింది. అంతేకాకుండా కేంద్రానికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చింది.
ఆ సమయంలో ఏం చేస్తున్నారు?
జూలై 18న కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతంగా ఉన్న బీసీసీఐ ప్రతిష్ట దెబ్బతిందని రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అందుకే ఈ తీర్పును నిలుపుదల చేయాలని రోహత్గీ కోరడంపై సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. తాము జూలైలో తీర్పు ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారంటూ రోహత్గీని ప్రశ్నించింది. లోధా ప్యానెల్ సంస్కరణలతో ఈ మూడు సంఘాలు తమ ఓటు హక్కును కోల్పోయాయి.
కొత్త పాలకుల పేర్లు సూచించండి
Published Wed, Jan 25 2017 12:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
Advertisement