వరల్డ్‌కప్ వరకు ధోని : రవిశాస్త్రి
మహేంద్రసింగ్ ధోని జట్టులో కొనసాగుతాడా లేదా అన్న సందేహాలకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టతనిచ్చారు.
కొలంబో: ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచకప్ వరకు భారత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని జట్టులో కొనసాగుతాడా లేదా అన్న సందేహాలకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టతనిచ్చారు. ధోని కెరీర్ సగం కూడా అయిపోలేదని 2019 ప్రపంచకప్ వరకు జట్టులో ఉంటాడని తేల్చేశారు. శ్రీలంక సిరీస్‌లో ధోని మూడు మ్యాచ్‌ల్లో 45, 67,49 నాటౌట్‌లతో అదరగొట్టిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఓ జాతీయ ఛానెల్‌తో రవిశాస్త్రీ మాట్లాడారు. ‘ధోని ఒక దిగ్గజం. జట్టును ప్రభావితం చేయగల వ్యక్తి. డ్రెస్సింగ్ రూంలో ధోని ఉంటే ఓ ఆభరణము ఉన్నట్టు. అతని సేవలు జట్టుకు ఎంతో అవసరం. ధోనిని మినహాయించి 2019 వరల్డ్‌కప్ వరకు యువ ఆటగాళ్లను రోటేషన్ పద్దతిలో ప్రయోగిస్తాం’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
ధోని ప్రపంచంలోనే దిగ్గజ వికెట్ కీపర్ అని, సచిన్, గవాస్కర్‌లు 36 ఏళ్ల వరకు ఆడారని అలాంటిది ధోని విషయంపైనే ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించారు. ప్రపంచకప్‌కు ముందు భారత్ 40 వన్డే మ్యాచ్‌లు ఆడబోతుందని, ఈ మ్యాచ్‌లన్నిటి ప్రపంచకప్‌కు ప్రయోగ మ్యాచ్‌లుగా వాడుకుంటామని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇప్పటికే జట్టులోని సభ్యులందరికీ అవకాశం వచ్చిందని, రానివారకి కూడా అవకాశం ఇస్తామని తెలిపారు.
జట్టు ఎంపిక ప్రక్రియలో పాలుపంచుకోవడం నాపని కాదని, అది సెలక్టర్ల పని అన్నారు. ఆటగాళ్లు నాపై నమ్మకంతో ఉండటమే నాకు కావాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌పైనే జట్టు ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచకప్ ప్రణాళికలనుంచి రైనా, యువరాజ్‌లను తొలిగించారన్న ప్రశ్నకు అవునని రవిశాస్త్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లు వారికంటే ఫిట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు.