ధోనినే కారణం: కోహ్లి
న్యూఢిల్లీ:ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలంటున్నాడు భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే చాలా ఆలోచించిన తరువాతే ఒక కచ్చితమైన నిర్ణయానికి రావాలంటున్నాడు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకునే ముందు సవాల్ ఎదురవుతుందని, ఆ సమయంలో తీసుకునే నిర్ణయానికి చాలా ధైర్యం కావాలని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తేనే నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటారని కోహ్లి పేర్కొన్నాడు.
మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత టెస్టు క్రికెట్ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న కోహ్లి.. నాయకత్వ లక్షణాలపై మాట్లాడాడు. 'నేను ధోని నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను ధైర్యంగా వేసే అడుగులు ధోని నుంచి నేర్చుకున్నవే. నా కెప్టెన్సీ సక్సెస్కు ధోనినే కారణం. ధోని ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే దానిపై అతన్ని దగ్గర్నుంచి చూశా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత అది తప్పైనా దానికే కట్టుబడి ఉండాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి వుంటుంది. కొన్ని సమయాల్లో స్వతహాగా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిస్తుంది. అప్పుడు చాలా ధైర్యం కావాలి. మనం తీసుకునే నిర్ణయంలో సవాల్ ఎదురైతే దాన్ని సమర్ధవంతంగా స్వీకరించాలి. ఆ తరహా లక్షణాలే కెప్టెన్గా ఎదగడానికి దోహం చేస్తాయి'అని కోహ్లి తెలిపాడు.