విరాట్, ధోని కెప్టెన్సీలో తేడా లేదు..కానీ
కోల్కతా:త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్కు ఎంపికైన వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు స్పష్టం చేశాడు. తన రంజీ జట్టు బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కంటే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంతో మెరుగ్గా ఉంటుందన్నాడు. బెంగాల్ జట్టుకు ఆడుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో చాలా గంభీరమైన వాతావరణం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ తరహా వాతావరణం తనకు అంతగా నచ్చదని సాహా చెప్పాడు. అదే సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అందుకు భిన్నంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నాడు.
ఇదిలా ఉండగా, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలపై సాహా ప్రశంసలు కురిపించాడు. ధోని, కోహ్లిల్లో ప్రతీ మ్యాచ్లో విజయం సాధించాలని కోరిక అమితంగా ఉంటుందన్నాడు. దానికోసం తమ శాయశక్తులా పోరాడతారని సాహా కొనియాడాడు. విరాట్, ధోని కెప్టెన్సీ విషయాల్లో పెద్దగా తేడా లేకపోయినా, కొన్ని విషయాల్లో మాత్రం ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుందన్నాడు. ముఖ్యంగా ఆన్ ఫీల్డ్లో ధోని కూల్గా ఉండటంతో పాటు మితంగా మాట్లాడితే, కోహ్లి మాత్రం చాలా దూకుడుగా ఉంటాడని పేర్కొన్నాడు. తన భుజాలపై ఆవేశాన్ని ధరించి వచ్చినట్లు కోహ్లి కనబడతాడన్నాడు. విరాట్, ధోనిల్లో ప్రధాన తేడా అదేనని ఈ బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సాహా అన్నాడు.
కాగా, ఒకసారి మ్యాచ్ ముగిసిపోయిందంటే కోహ్లి అంత ఫ్రెండ్లీగా మరొకరు ఉండరన్నాడు. ఒక రోజు ఆట ముగిసిపోయిన తరువాత కోహ్లిని చూస్తే ఇప్పటివరకూ ఫీల్డ్లో ఉన్న వ్యక్తేనా ఇలా ఉన్నాడని అనిపిస్తుందన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరితో చాలా సన్నిహితంగా కలిసిపోయే వ్యక్తిత్వం కోహ్లిదన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ చాలా కూల్గా మాట్లాడుతూ కొన్ని సూచనలు చేస్తూ తన అనుభవాన్ని మాతో పంచుకుంటాడని సాహా అన్నాడు.