బ్లోమ్‌ఫాన్‌టైన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే సఫారీలు కైవసం చేసుకుని బదులు తీర్చుకున్నారు. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను కూడా చేజిక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35) ఫర్వాలేదనిపించగా, కెప్టెన్ అరోన్ ఫించ్(69), డీఆర్సీ షాట్(69)లు అర్థ శతకాలు నమోదు చేశారు. మిచెల్ మార్ష్(36), అలెక్స్ క్యారీ(21)లు మోస్తరుగా ఆడటంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.( క్లాసెన్ అజేయ సెంచరీ)
అయితే అనంతరం 272 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ డీకాక్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో మరో ఓపెనర్ జన్నీమాన్ మలాన్‌కు స్మట్స్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించారు ఆపై క్లాసెస్-జన్నీమాన్‌లు సమయోచితంగా ఆడి జట్టు విజయానికి బాటలు వేశారు. మలాన్(129 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించగా, క్లాసెస్(51)హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(37 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 74 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డే శనివారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment