చార్లోటి కల్లా
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): వింటర్ ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకం స్వీడన్ ఖాతాలోకి వెళ్లింది. పోటీల తొలి రోజు శనివారం మహిళల స్కీయాథ్లాన్ క్రాస్ కంట్రీ ఈవెంట్‌లో స్వీడన్‌కు చెందిన చార్లోటి కల్లా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మారిట్ జోయెర్న్ (నార్వే) రజతం... క్రిస్టా పర్మాకోస్కీ (ఫిన్‌లాండ్) కాంస్యం సాధించారు. ఆతిథ్య దక్షిణ కొరియా జట్టు తొలి రోజే పసిడి బోణీ చేసింది. పురుషుల 1500 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో లిమ్ హయోజున్ కొరియాకు బంగారు పతకాన్ని అందించాడు. మరోవైపు మహిళల ఐస్ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియా–ఉత్తర కొరియా క్రీడాకారిణులతో కూడిన ఉమ్మడి కొరియా జట్టుకు ఓటమి ఎదురైంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్మడి కొరియా 0–8తో పరాజయం పాలైంది.
34వ స్థానంలో శివ కేశవన్
వరుసగా ఆరో వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత స్టార్ శివ కేశవన్‌కు తొలి రోజు నిరాశే ఎదురైంది. ల్యూజ్ క్రీడాంశం సింగిల్స్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన శివ కేశవన్ తొలి రోజు రెండు రేసులు ముగిశాక 1ని:39.288 సెకన్లతో 34వ స్థానంలో ఉన్నాడు. 1,365 మీటర్లతో కూడిన ట్రాక్‌పై అతను తొలి రేసును 50.578 సెకన్లలో... రెండో రేసును 48.710 సెకన్లలో ముగించాడు. 40 మంది పాల్గొంటున్న ఈ రేసులో ఆదివారం మరో రెండు రేసులు జరుగుతాయి. నిర్ణీత నాలుగు రేసులు ముగిశాక అత్యుత్తమ సమయం నమోదు చేసిన తొలి ముగ్గురికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment