సహనం... సంయమనం... సాధికారం... మెల్‌బోర్న్ టెస్టు మొదటి రోజు భారత ఇన్నింగ్స్‌ను సెషన్ల వారీగా చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది. క్రీజులో పాతుకుపోతే పరుగులు వాటంతటవే వస్తాయనే టెస్టు నానుడికి తగ్గట్లుగా సాగింది టీమిండియా బ్యాటింగ్. కుర్ర ఓపెనర్ల ఓపికైన ఆరంభానికి సీనియర్ల అర్ధవంతమైన భాగస్వామ్యంతో మన జట్టు ఒడ్డున పడింది. సంతృప్తికర స్కోరుతో ఆటను ముగించింది. రెండో రోజు గురువారం దీనిని కెప్టెన్ విరాట్ కోహ్లి, డిపెండబుల్ చతేశ్వర్ పుజారా ఇంకెంత ముందుకు తీసుకెళ్తారో? రహానే, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తమవంతుగా మరెన్ని పరుగులు చేస్తారో? అనేదానిపై ఈ మ్యాచ్‌లో భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మెల్‌బోర్న్: అరంగేట్ర ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (161 బంతుల్లో 76; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (200 బంతుల్లో 68 బ్యాటింగ్; 6 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) అద్వితీయ భాగస్వామ్యంతో బాక్సింగ్ డే టెస్టును టీమిండియా ఆశావహంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 89 ఓవర్లలో 215/2 స్కోరుతో నిలిచింది. టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకోగా... మయాంక్‌తో పాటు తొలిసారి ఓపెనింగ్‌కు దిగిన ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (66 బంతుల్లో 8) జట్టుకు కావాల్సిన విధంగా ఆడాడు. వీరిద్దరినీ కమిన్స్ (2/40) ఔట్ చేశాడు.
ఓపెనర్ల ఓపిక...
ప్రారంభ ఇబ్బందులను తట్టుకుంటూ, కొత్త బంతి మెరుపు తగ్గేలా చేసి కీలకమైన మిడిలార్డర్ తగినంత స్వేచ్ఛగా ఆడేలా చూడడం ఓపెనర్ల ప్రథమ కర్తవ్యం. మయాంక్, విహారి మెల్‌బోర్న్‌లో అదే చేశారు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతే ఫుల్‌టాస్ పడి విహారి బ్యాట్ వెలుపలి అంచును తాకింది. అప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లు పరీక్షకు గురి చేసినా కుర్రాళ్లిద్దరూ ఓపిక కోల్పోలేదు. ఇద్దరిలో విహారి వికెట్ ఇవ్వకూడదన్నట్లు పట్టుదల చూపగా... మయాంక్ వీలుచిక్కినప్పుడల్లా పరుగులు సాధించాడు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ 8వ ఓవర్లోనే స్పిన్నర్ లయన్‌ను దించాడు. అతడిని సులువుగా ఎదుర్కొన్న మయాంక్ బౌండరీలు బాదాడు. అయితే, 19వ ఓవర్ ఐదో బంతికి ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆడక తప్పని విధంగా కమిన్స్ వేసిన బంతి విహారి గ్లోవ్‌ను తాకుతూ స్లిప్‌లోని ఫించ్‌కు క్యాచ్‌గా వెళ్లింది. దీంతో 40 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మయాంక్, పుజారా అదే నిగ్రహం చూపడంతో భారత్ 57/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం అనంతరం కూడా ఆసీస్ బౌలర్లను వీరు ఆచితూచి ఎదుర్కొన్నారు. లయన్ ఓవర్లో ఫోర్ కొట్టి మయాంక్ అర్ధ శతకం (95 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అతడి బౌలింగ్‌లోనే లాంగాన్‌లోకి సిక్స్ బాదాడు. స్ట్రోక్ ప్లేతో బౌండరీలు బాదుతూ తనను అసహనానికి గురిచేస్తున్న మయాంక్‌ను కమిన్స్ షార్ట్ పిచ్ బంతితో పడగొట్టాడు. దీంతో టీమిండియా టీ బ్రేక్‌కు వెళ్లింది. మయాంక్–పుజారా రెండో వికెట్‌కు 83 పరుగులు జత చేశారు. అప్పటికి స్కోరు 123/2.
సీనియర్ల అండ...
రెండు సెషన్లు పూర్తయి... స్కోరు బోర్డుపై పెద్దగా పరుగులు లేని స్థితిలో పుజారా, కోహ్లి జత కలిశారు. లోపలి అంచులకు తగిలిన బంతులు, టాప్ ఎడ్జ్ అయిన బంతులు, ఎల్బీ అప్పీళ్లు, సమీక్ష... ఇలా పలు సవాళ్లను ఎదుర్కొంటూనే చివరి సెషన్‌లో పూర్తి సంయమనంతో ఆడారు వీరు. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో కోహ్లి పూర్తి టచ్‌లోకి రాగా, పుజారా అర్ధశతకం (152 బంతుల్లో) అందుకున్నాడు. మరోవైపు లయన్ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీ కోరిన ఆసీస్ సమీక్ష వృథా చేసుకుంది. ఇక్కడి నుంచి కొంతసేపు ఈ జోడీ సాధికారికంగా ఆడింది. 83వ ఓవర్‌లో కొత్త బంతి తీసుకున్నాక స్టార్క్ వాడి చూపించాడు. 87వ ఓవర్లో కోహ్లిని తీవ్ర పరీక్షకు గురిచేశాడు. ఓ బంతి ప్యాడ్‌కు తగలగా, మరోటి ఇన్‌సైడ్ ఎడ్జ్ అయింది. ఈ క్రమంలో పైన్ క్యాచ్ వదిలేయడంతో భారత కెప్టెన్‌కు లైఫ్ దక్కింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్న కెప్టెన్ రోజును సాఫీగా ముగించాడు. కోహ్లి–పుజారా మూడో సెషన్‌లో అభేద్యంగా 92 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 దాటింది.
ఎలాంటి పిచ్చో? ఏమో?
ఎప్పటిలాగే బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు మెల్‌బోర్న్ మైదానానికి అభిమానులు పోటెత్తారు. 73 వేల మందిపైగా వచ్చారు. దీంతో స్టాండ్స్ అన్నీ నిండిపోయి మైదానం కళకళలాడింది. అయితే, పిచ్ తీరే కొంత భిన్నంగా కనిపించింది. పేసర్లు ప్రభావవంతంగా లేకపోవడంతో ఆస్ట్రేలియా కెప్టె¯Œ టిమ్ పైన్ ఆరంభంలోనే స్పిన్నర్ నాథన్ లయన్‌ను దింపాడు. పేసర్ కమిన్స్ తప్ప మిగతా బౌలర్లెవరూ వికెట్ తీయలేకపోయారు. అయితే, రెండో సెషన్‌లో కొన్ని బంతులు తక్కువ ఎత్తులో వచ్చాయి. కొన్ని అనూహ్యంగా పైకి లేచాయి. కొత్త బంతిని తీసుకున్నాక మాత్రం స్టార్క్, హాజల్‌వుడ్ పదును చూపారు. ఇప్పటికి ఉన్న అంచనా అయితే... ఎండ కారణంగా పిచ్ నెర్రెలుబారి మ్యాచ్ మూడు, నాలుగు రోజుల్లో స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా గురువారం మొత్తం ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకుపైగా చేస్తే... మ్యాచ్ ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.
మయాంక్ హిట్... విహారి పాస్
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా దిగిన మయాంక్, విహారి తమ బాధ్యత నెరవేర్చారు. శుభారంభంతో పాటు కొత్త బంతి మెరుపు తగ్గే వరకు ఆడి టీమిండియాకు ఉపశమనం కలిగించారు. ముఖ్యంగా మయాంక్ స్వేచ్ఛగా ఆడిన తీరు ముచ్చట గొలిపింది. సిరీస్‌లో భారత్‌కు సవాలు విసురుతున్న స్పిన్నర్ లయన్‌ను అతడు దెబ్బకొట్టాడు. లయన్ బౌలింగ్‌లో మయాంక్ పరుగులు రాబట్టిన తీరు మిగతా బ్యాట్స్‌మెన్ పైనా ఒత్తిడి లేకుండా చేయనుంది. అరంగేట్రంలోనే సెంచరీ చేజార్చుకున్నా, కావాల్సినంత ఆత్మవిశ్వాసం అయితే మూటగట్టుకున్నాడు. మరోవైపు స్కోరు తక్కువే అయినా విహారి ఇన్నింగ్స్‌నూ చిన్నది చేయలేం. ఎదుర్కొన్న 25వ బంతికి తొలి పరుగు చేసిన విహారి... ఆసీస్ పేసర్లను సమర్థంగా కాచుకున్నాడు. మొత్తానికి తన నుంచి జట్టుకు ఏం కోరుకుంటోందో అది చేసి చూపాడు.
►295 ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 295వ క్రికెటర్‌గా మయాంక్ అగర్వాల్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా మయాంక్ ఘనత వహించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు దత్తు ఫాడ్కర్ (51 పరుగులు–1947లో సిడ్నీలో) పేరిట ఉండేది.
ఇది వర్ణించలేని అనుభూతి
టీమిండియా టెస్టు క్యాప్ అందుకునే సమయంలో ఉద్వేగానికి గురయ్యా. కానీ, నన్ను నేను అదుపు చేసుకున్నా. మెల్‌బోర్న్‌లో అరంగేట్రం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. నేను వేసుకున్న ప్రణాళికను గుర్తుచేసుకుంటూ వాటికి కట్టుబడ్డాను. మరిన్ని పరుగులు చేసి... నాటౌట్‌గా రోజును ముగించాల్సింది. అయినా ఈ ప్రారంభం సంతృప్తినిచ్చింది. పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించ లేదు. బ్యాటింగ్‌కు కొంత అనుకూలంగా ఉంది. ఆసీస్ బౌలర్లు పకడ్బందీగా బంతులేశారు. విహారి అద్భుత ఆటగాడు. ఓపెనర్ పాత్రలో చక్కగా సరిపోయాడు. భారీ స్కోర్లు చేయకున్నా పర్లేదు... ఎక్కువ బంతులు ఆడాలని మేం భావించాం.
- మయాంక్ అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment