ఒకే రోజు ఏకంగా 407 పరుగులు... చివరి సెషన్‌లోనైతే 30 ఓవర్లలోనే 190 పరుగులు... ఒక బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ, మరో ముగ్గురు అర్ధ సెంచరీలు...తలా వందకు పైగా పరుగులు సమర్పించుకున్న నలుగురు బౌలర్లు... బంగ్లాదేశ్‌పై భారత బ్యాట్స్‌మెన్ కొనసాగించిన ఊచకోతకు ఇది నిదర్శనం. పేరుకు టెస్టు మ్యాచే అయినా పరిమిత ఓవర్లలాగే ఆడిన టీమిండియా దూకుడు ముందు ప్రత్యర్థి తేలి పోయింది. మయాంక్ అగర్వాల్ ద్విశతకం శుక్రవారం ఆటలో హైలైట్‌గా నిలవగా, ఇప్పటికే 343 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా ఖాతాలో మరో గెలుపు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. కోహ్లిని డకౌట్ చేశామన్న ఆనందం తప్పిస్తే రెండో రోజే పూర్తిగా చేతులెత్తేసిన బంగ్లాదేశ్‌ను ఓటమి పలకరిస్తోంది.
ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ విజయంపై గురి పెట్టింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నిం గ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (330 బంతుల్లో 243; 28 ఫోర్లు, 8 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అజింక్య రహానే (172 బంతుల్లో 86; 9 ఫోర్లు), రవీంద్ర జడేజా (76 బంతుల్లో 60 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (72 బంతుల్లో 54; 9 ఫోర్లు) కూడా రాణించారు. జాయెద్‌కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం జడేజాతో పాటు ఉమేశ్ యాదవ్ (10 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. మయాంక్ వరుసగా పుజారాతో 91, రహానేతో 190, జడేజాతో 123 పరుగులు జోడించడం విశేషం. భారత్ ఇన్నింగ్స్‌ను ఎప్పుడు డిక్లేర్ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.
కోహ్లి డకౌట్...
ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొందరగానే పుజారా వికెట్ కోల్పోయింది. జాయెద్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 68 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పుజారా... జాయెద్ తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. భారత్‌కు వెంటనే మరో షాక్ తగిలింది. జాయెద్ తన తర్వాతి ఓవర్లోనే కోహ్లి (0)ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. కోహ్లి కెరీర్‌లో ఇది పదో డకౌట్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూ కోరిన బంగ్లా ఫలితం సాధించింది. దాంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.
రహానే జోరు...
కోహ్లి పెవిలియన్ చేరాక బరిలోకి దిగిన రహానే తనదైన శైలిలో చక్కటి షాట్లు ఆడాడు. జాయెద్ ఓవర్లోనే రెండు ఫోర్లతో అతను తను ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. ఈ క్రమంలో రహానే టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటాడు. లంచ్ తర్వాత 105 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మయాంక్‌తో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. మరికొన్ని అందమైన డ్రైవ్‌లు ఆడి సెంచరీకి చేరువవుతున్న దశలో ఒక తప్పుడు షాట్‌తో రహానే ఇన్నింగ్స్ ముగిసింది. జాయెద్ వేసిన బంతిని కట్ చేయబోగా డీప్ పాయింట్‌లో ఫీల్డర్ చేతికి చిక్కింది. భారత్ కోల్పోయిన తొలి 4 వికెట్లు జాయెద్ ఖాతా లోనే చేరడం విశేషం. ఆ తర్వాత వచ్చిన జడేజా దూకుడుగా ఆడటంతో స్కోరు వేగంగా దూసుకు పోయింది. 72 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. సాహా (12) విఫలమైనా... చివర్లో ఉమేశ్ భారీ షాట్లతో వినోదం పంచాడు. జాయెద్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను ... ఇబాదత్ వేసిన ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు.
సూపర్ బ్యాటింగ్...
మయాంక్ తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది సార్లు క్రీజ్ వదిలి ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు. ఇందులో ఒక్కసారి మినహా ఎనిమిది సార్లు ఆ షాట్లు సిక్సర్లుగా మారాయి. తన బ్యాటింగ్‌పై అతనికున్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఎలాంటిదో ఇది చూపిస్తుంది. శుక్రవారం అద్భుత ప్రదర్శన కనబర్చిన మయాంక్ ఎక్కడా ఒక్కసారి కూడా కనీసం తడబడలేదు. 96 శాతం బంతులను అతను పూర్తి నియంత్రణతో ఎదుర్కోవడం విశేషం. డబుల్ సెంచరీని కూడా అతను సిక్సర్‌తో పూర్తి చేయడం సెహ్వాగ్ శైలిని గుర్తుకు తెచ్చింది. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన అతను మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. ముఖ్యంగా బంగ్లా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు స్పిన్నర్లు తైజుల్, మెహదీలను మయాంక్ చితక్కొట్టాడు. వీరిద్దరి బౌలింగ్‌లోనే 19 బౌండరీలు బాదడం పరిస్థితిని సూచిస్తోంది. తొలి రోజు ఇన్నింగ్స్ మొదటి బంతినే ఫోర్‌గా మలచి పరుగుల ఖాతా తెరిచిన మయాంక్ విధ్వంసం రెండో రోజు దాదాపు చివరి వరకు సాగింది.
రెండో రోజు ఇబాదత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో 98 బం తుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఇది ఆరంభం మాత్రమే... అసలు ఆట ఇంకా ముందుంది అన్నట్లుగా అగర్వాల్ దూసుకుపోయాడు. మెహదీ ఓవర్లో బౌలర్ తల మీదుగా అతను నేరుగా ఒక చూడచక్కటి సిక్సర్ బాదాడు. అతని ఎనిమిది సిక్సర్ల జాబితాలో ఇది మొదటిది. 82 పరుగుల వద్ద మెహదీ బౌలింగ్‌లోనే అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే రివ్యూ కోరిన మయాంక్ బతికిపోయాడు. లంచ్ తర్వాత ఇబాదత్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 183 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న మయాంక్ మరికొన్ని అద్భుతమైన స్ట్రోక్‌లు ఆడాడు. తైజుల్ బౌలింగ్‌లో అతను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా కొట్టిన ‘ఇన్‌సైడ్ అవుట్’ సిక్సర్ రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది! 234 బంతుల్లో అతను 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు.
ఆ తర్వాత కూడా అలసట లేకుండా, ఎక్కడా తగ్గకుండా పరుగుల వరద పారించాడు. ఇబాదత్ ఓవర్లో ఫోర్‌తో అతను 190ల్లోకి ప్రవేశించాడు. పెవిలియన్ నుంచి భారత జట్టు సభ్యులంతా ప్రోత్సహిస్తుండగా తర్వాతి ఓవర్లోనే మయాంక్ మరో మైలురాయిని దాటాడు. మెహదీ బౌలింగ్‌లో దూసుకొచ్చి వైడ్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టడంతో అతని డబుల్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత వేగంగా ఆడిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 26 బంతుల్లోనే చకచకా 41 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు మెహదీ హసన్ బౌలింగ్‌లో ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ముగిసింది. స్వీప్ షాట్ ఆడబోయిన అతను డీప్ మిడ్ వికెట్‌లో జాయెద్ చక్కటి క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
ఇండోర్ ప్రేక్షకులు అభినందనలతో హోరెత్తిస్తుండగా మయాంక్ పెవిలియన్ చేరాడు. 76, 42, 77, 5, 16, 55, 4, 215, 7, 108, 10, 243... టెస్టు కెరీర్ తొలి 12 ఇన్నింగ్స్‌లలో మయాంక్ స్కోర్లు ఇవి. మూడు అర్ధ సెంచరీలు, మూడు సెంచరీలు ఉండగా... అందులో రెండు డబుల్ సెంచరీలే! ఈ పరుగుల ప్రవాహం ఇలాగే కొనసాగించగల సత్తా మయాంక్‌లో ఉందని మళ్లీ రుజువైంది. మరోవైపు శుక్రవారమంతా అగర్వాల్ ఆటను చూస్తూ ఇమ్రుల్ కైస్ మాత్రం తనలో తానే ఎంతగానో కుమిలిపోయి ఉంటాడు. తొలి రోజు 32 పరుగుల వద్ద మయాంక్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో అతనే వదిలేశాడు మరి!
►12 రెండో డబుల్ సెంచరీ చేసేందుకు మయాంక్‌కు పట్టిన ఇన్నింగ్స్‌లు. వినోద్ కాంబ్లీ (5) మాత్రమే అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, బ్రాడ్‌మన్‌కు 13 ఇన్నింగ్స్ పట్టాయి.
►8 మయాంక్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. భారత్ తరఫున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. గతంలో నవ్‌జ్యోత్ సిద్ధూ (8–శ్రీలంకపై 1994లో) సాధించిన ఘనతను మయాంక్ సమం చేశాడు.
300 కావాలి...
ఆటలో సహచరులను ప్రోత్సహించడంలో కెప్టెన్ కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. శుక్రవారం అది మరోసారి స్పష్టంగా కనిపించింది. కోహ్లికి, మైదానంలో ఉన్న మయాంక్‌కు మధ్య సైగలతోనే మాటలు నడిచాయి. మయాంక్ సెంచరీ దాటిన తర్వాత ఇంకా ఆడమంటూ చేతితో కోహ్లి సంజ్ఞలు చేశాడు. 150 దాటిన తర్వాత డబుల్ సెంచరీ కావాలంటూ రెండు వేళ్లు చూపించాడు. 200 పరుగులకు చేరగానే పని పూర్తయిందన్నట్లుగా కోహ్లి వైపు మయాంక్ రెండు వేళ్లు చూపించాడు. ఇది సరిపోదు...ఇంకా కావాలి, ట్రిపుల్ సెంచరీకి ప్రయత్నించు అన్నట్లుగా విరాట్ మళ్లీ మూడు వేళ్లతో సైగ చేయడం విశేషం. మయాంక్ కొంత వరకు ప్రయత్నించినా చివరకు ‘ట్రిపుల్’ సాధ్యం కాలేదు కానీ కెప్టెన్ పదే పదే ఆదేశాలిచ్చినట్లు, దానిని తాను పాటించినట్లుగా బ్యాటింగ్ సాగడం అరుదుగా కనిపించే దృశ్యం.
తొలి సెషన్
ఓవర్లు: 28,
పరుగులు: 102, వికెట్లు: 2
రెండో సెషన్
ఓవర్లు: 30,
పరుగులు: 115, వికెట్లు: 0
మూడో సెషన్
ఓవర్లు: 30,
పరుగులు: 190, వికెట్లు: 3
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్:150; భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) జాయెద్ (బి) మెహదీ హసన్ 243; రోహిత్ (సి) లిటన్ దాస్ (బి) జాయెద్ 6; పుజారా (సి) సబ్–సైఫ్ హసన్ (బి) జాయెద్ 54; కోహ్లి (ఎల్బీ) (బి) జాయెద్ 0; రహానే (సి) తైజుల్ (బి) జాయెద్ 86; జడేజా (బ్యాటింగ్) 60; సాహా (బి) ఇబాదత్ 12; ఉమేశ్ యాదవ్ (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (114 ఓవర్లలో 6 వికెట్లకు) 493.
వికెట్ల పతనం: 1–14; 2–105; 3–119; 4–309; 5–432; 6–454.
బౌలింగ్: ఇబాదత్ 31–5–115–1; అబూ జాయెద్ 25–3–108–4; తైజుల్ 28–4– 120–0; మెహదీ హసన్ 27–0–125–1; మహ్ముదుల్లా 3–0–24–0.
Comments
Please login to add a commentAdd a comment