
లండన్: వచ్చే ఆదివారం జరుగనున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయీస్ స్పష్టం చేశారు. ఆ సింగిల్స్ ఫైనల్ లండన్‌లో ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు మొదలుకానుంది. అయితే అదేరోజు సాయంత్రం 4 గంటలకు (యూకే సమయం ప్రకారం) ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.
ఒకవేళ బుధవారంనాటి సెమీస్‌లో క్రొయేషియాపై ఇంగ్లండ్ గెలిచి తుదిపోరుకు చేరితే.. ఆదివారం నాడు అటు ప్రపంచ కప్ ఫైనల్.. ఇటు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ సమాంతరంగా జరుగుతాయి. దాంతో.. రెండు మ్యాచ్‌లను తిలకించడం ఎలా అన్న వాదనను క్రీడా ప్రేమికులు, ఫుట్‌బాల్ అభిమానులు లేవనెత్తుతున్నారు. ఈనేపథ్యంలో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సమయాన్ని మార్చాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ రిచర్డ్ మాత్రం ‘సంప్రదాయం ప్రకారం రెండు గంటలకే ఫైనల్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఆ టైమ్‌కే నిర్వహిస్తాం’ అని కుండబద్దలుకొట్టారు.