
చెన్నై: మైదానంలో ధనాధన్ ఎంఎస్ ధోని బంతిని ఎదుర్కోవడానికి భయపడతాడంటే ఎవరైనా నమ్మగలరా? కానీ నమ్మాలి. ఎందుకంటే స్వయంగా ఈ విషయాన్ని అతనే బయటపెట్టాడు కాబట్టి! అంతేకాకుండా ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో కనిపించే మహీ... మైదానంలో ఒత్తిడికి కూడా గురవుతానని చెప్పాడు. భారత మాజీ ఆటగాళ్లు ఎస్.బద్రీనాథ్, శరవణ కుమార్ నెలకొల్పిన ‘ఎంఫోర్’ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో వీడియో కాల్ ద్వారా ధోని, కోహ్లి, అశ్విన్‌లు మానసిక ఆరోగ్యం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్య సమస్యలని అంగీకరించే పరిస్థితి లేదన్నాడు. వాటిని ఆరోగ్య సమస్యలుగా భావిస్తారని పేర్కొన్నాడు.(పతకానికి చేరువై.. అంతలోనే దూరమై..)
‘ఇది ఎవరూ బయటకు చెప్పరు... కానీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా. నేను క్రీజులోకి వెళ్లిన ప్రతీసారి తొలి ఐదు–పది బంతులు ఎదుర్కొనే వరకు నా గుండె వేగం పెరుగుతుంది. ఆ సమయంలో భయం వేస్తుంది. ఒత్తిడికి కూడా గురవుతా. సహజంగా అందరికీ ఇదే అనుభవం ఎదురవుతుంది. దీన్నెలా ఎదుర్కోవడం? ఇది చాలా చిన్న సమస్యే. దాచిపెట్టకుండా తరచూ మెంటల్ కండిషనింగ్ కోచ్‌తో మన సమస్యలు పంచుకుంటే వీటి నుంచి బయటపడొచ్చు. అందుకే తప్పనిసరిగా అతను జట్టుతో ఉండాలి’ అని ధోని అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లి మానసిక స్పష్టత అనేది క్రీడల్లోనే కాదు మొత్తం జీవితానికే ఎంతో ముఖ్యమైందని చెప్పాడు. మానసిక స్థైర్యం పెంచుకుంటేనే క్రీడల్లో క్లిష్టపరిస్థితుల్ని అధిగమించవచ్చని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment