
కోల్‌కతా : నగరంలోని సగటు పుట్‌బాల్ అభిమాని ప్రార్థించే ప్రార్థన ‘మెస్సీ విల్ డూ ఏ టెండూల్కర్’. గతవారం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఈ సారీ ప్రపంచకప్‌ను ముద్దాడాలనే కోరిక బయటపెట్టడంతో ఈ లెజండరీ ప్లెయర్‌కు మరింత మద్దతు పెరుగుతోంది. ఇక కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ వ్యవస్థాపకుడు, సెక్రటరీ ఉత్తమ్ సాహా ఆధ్వర్యంలో మెస్సీకి మద్దతుగా ఈ నినాదాన్ని నినదించారు.
భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాదిరిగానే లియోనల్ మెస్సీ కూడా తన దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కానీ ఈ లెజండరీ ఆటగాళ్లకు ప్రపంచ కప్ అందని ద్రాక్షలాగే ఉండేది. కాగా, సచిన్ తాను ఆడిన చివరి వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచి ఆటకు ఘనంగా వీడ్కోలు పలికాడు. అలాగే మెస్సీ కూడా తాను ఆడే చివరి ప్రపంచకప్ గెలిచి సచిన్ దారిలో నడుస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సచిన్, మెస్సీల జెర్సీ నంబర్ ఒకటే కావడం, సహచర ఆటగాళ్లలో స్పూర్తి నింపడం, జట్టు కఠిన సమయంలో ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు భుజాలపై వేసుకోవడం ఈ ఇద్దరి ఆటగాళ్లకున్న కామన్ పాయింటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 2014 ఫిఫా ప్రపంచకప్‌లో అద్భుత ఆట తీరుతో ఫైనల్‌కి చేరిన అర్జెంటీనా.. అనూహ్యంగా 0-1 తేడాతో జర్మనీ చేతిలో ఓడిపోయింది. రేపు(జూన్ 14న) రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి సమరంతో ఫిఫా ప్రపంచకప్ 2018 టోర్నీ ఆరంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment