వచ్చే ఏడాదే అతడి రిటైర్మెంట్!
కరాచీ: రిటైర్మెంట్ అంశంపై కొన్ని రోజులవరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ను కోరింది. వచ్చే ఏడాది వరకూ ఆటను కొనసాగించాలని బోర్డు మిస్బాను సంప్రదించింది. ఇంగ్లండ్తో సిరీస్ జరిగే వరకు వీడ్కోలు విషయంపై ఎటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవద్దని పేర్కొంది. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ ముగిశాక తన రిటైర్మెంట్ విషయాన్ని బోర్డుకు వెల్లడిస్తాడని మిస్బా చెప్పాడు. ఒకవేళ వీడ్కోలు పలకాలని మిస్బా భావించినట్లయితే, మరో ఏడాదిపాటు ఆటను కొనసాగించాలని అతడిని కోరతామన్నాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో కెప్టెన్, సీనియర్ ప్లేయర్గా మిస్బా జట్టులో ఉండటం మాకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతవారం దుబాయ్లో ఇంగ్లండ్పై టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం తన రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు. 2010లో పాక్ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లతో సిరీస్లు జరగలేదని, వచ్చే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో టెస్ట్ సిరీస్లు ముగిశాక మిస్బా రిటైర్మెంట్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచకప్లో ఆసీస్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు మిస్బా గుడ్ బై చెప్పిన విషయం విదితమే.