పీటర్సన్ను కొట్టబోయా!
పెర్త్:దాదాపు ఏడు సంవత్సరాల కిందటి ఘటన. అది కూడా యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు వార్మప్ చేస్తున్న సమయం. అప్పుడు ఇంగ్లండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ను ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కొట్టేంత పనిచేశాడట. అందుకు కారణం పీటర్సన్ పదే పదే ఆసీస్ ఆటగాళ్లను ఏడిపించాడట. దాంతో కోపం తట్టుకోలేని తాను పీటర్సన్ పైకి దూసుకెళ్లి అతనితో మాటల యుద్ధానికి దిగినట్టు మిచెల్ పేర్కొన్నాడు.
'2009లో ఇంగ్లండ్తో మొదటి యాషెస్ మ్యాచ్కు సన్నద్ధమవుతున్న సమయంలో మాతో పాటు ఇంగ్లండ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంది. దానిలో భాగంలో తమ ఆటగాళ్ల ప్రాక్టీస్ చేసే చోటకు పీటర్సన్ బంతిని హిట్ చేస్తున్నాడు. ఒకసారి మా వైపుకు వచ్చిన బంతిని ఇచ్చి పీటర్సన్ను ఇక ఇటువైపు కొట్టవద్దని చెప్పా. అయినప్పటికీ అతను వినలేదు. మళ్లీ మళ్లీ కొడుతూనే ఉన్నాడు. ఇక కోపం తట్టుకోలేక ఒక్కసారిగా పీటర్సన్పైకి దూసుకెళ్లాను. ఇక ఆ తరువాత మా ఇద్దరి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. ఆ క్రమంలోనే పీటర్సన్ నోరు జారాడు. ఇక కొట్టకోవడం ఒకటే తరువాయి. ఆ తరుణంలో తన సహచర ఆటగాడు స్టువర్ట్ క్లార్క్ ఇద్దరి మధ్యకు దూకి గొడవను సద్దుమణిగేలా చేశాడు' అని మిచెల్ జాన్సన్ తన తాజా ఆటో బయోగ్రపీ 'రీసైలెంట్'లో పేర్కొన్నాడు.