ఫాలో ఆన్ తప్పించుకున్న ఇంగ్లండ్
మాంచెస్టర్: యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ ఫాలో ఆన్ తప్పించుకుంది. ఓల్ట్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 139 ఓవర్లలో 368 పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో 70 పరుగులు చేసింది. కెవిన్ పీటర్సన్(113) చలవతో ఇంగ్లండ్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. చక్కటి షాట్లతో అభిమానులను అలరించిన కేపీ, స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్ కట్ ద్వారా... 165 బంతుల్లో టెస్టుల్లో తన 23వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (25) తర్వాతి స్థానంలో పీటర్సన్ నిలిచాడు. అతనికి బెల్ (60) పరుగులతో తోడ్పడటంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ తప్పించుకుంది. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ వికెట్టు నష్టానికి 24 పరుగులతో ఆడుతోంది. అంతకు ముందు ఆస్ట్రేలియా ఏడు వికెట్లు నష్టానికి 527 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.