జైజై నాయకా!
బురద చల్లించుకున్న చోట పన్నీరు పూయించుకుంటున్నాడు టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. విఫలమైన చోటే విజయాలు సాధించి జేజేలు అందుకుంటున్నాడు. ఎంతలో ఎంత మార్పు. పొడుగు ఫార్మాట్ లో ఘోరంగా విఫలమయిన గడ్డపైనే పొట్టి ఫార్మాట్ లో సత్తా చాటి విజయవంతమైన నాయకుడిగా ఖ్యాతిని ఆర్జించడం మహేంద్రుడికే చెల్లింది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి సిరీస్ సాధించింది. టెస్టుల్లో చతికిలపడిన జట్టేనా ఈ విజయం సాధించింది అన్న అనుమానం కలిగేలా వన్డేల్లో విజృంభించింది. టెస్టుల్లో ఎంత దారుణంగా ఓడిపోయారో, వన్డేల్లో అంతగా రెచ్చిపోయారు.
ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భారత్ జట్టు 1-3 తేడాతో ఓడిపోయినప్పుడు ధోని నాయకత్వంపై దుమ్మెత్తిపోశారు. అతడు టెస్టు నాయకత్వానికి పనికిరాడని అన్నారు. టెస్టు కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఫార్మాట్ మారడంతో టీమిండియా మళ్లీ గాడిలో పడింది. వన్డేల్లో టాప్ ర్యాంకు కూడా సాధించింది. అంతేకాదు భారత్ కు అత్యధిక వన్డే విజయాలు అందించిన నాయకుడిగా ధోని కొత్త రికార్డు లిఖించాడు. దీంతో ధోనిపై విమర్శలు ఆగిపోయాయి.
అయితే టెస్టుల్లో ఓటమి అతడు ఇంకా సమాధానం చెప్పలేదు. ఆటలో గెలుపోటములు సహజం. అగ్రశ్రేణి జట్టు కనీస పోరాట పటిమ కనబరచకుండా కుదేలవడాన్ని క్రికెట్ అభిమానులు కాదు ఎవరూ జీర్ణించుకోలేరు. 'హ్యాట్రిక్' ఘోర పరాజయాలతో టెస్టు సిరీస్ లో ఇంగ్లీషు గడ్డపై టీమిండియా చతికిలపడడం మామూలు విషయం కాదు. సిసలైన క్రికెట్ కు పర్యాయపదంగా నిలుస్తున్న టెస్టుల్లో ఇప్పుడు ధోని సేన నిరూపించుకోవాల్సింది. దిగ్గజాల స్థానంలో వచ్చిన వారితో టెస్టు విజయాలు సాధిస్తేనే ధోని నిజమైన నాయకుడిగా నిరూపితమవుతాడు.