
ధోని తప్పుకోవాలా?
ఏ క్రికెటరైనా జాతీయ జట్టులో ఆడాలనుకోవడం సహజం. అందులోనూ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఆడే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు.
న్యూఢిల్లీ: ఏ క్రికెటరైనా జాతీయ జట్టులో ఆడాలనుకోవడం సహజం. అందులోనూ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఆడే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. జాతీయ జట్టులో స్థానం ఆశించే క్రమంలో పోటీ ఎక్కువగా ఉంటే టాలెంట్ ఉన్నా కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. భారత క్రికెట్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి పోటీగా వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టుల నుంచి ధోని తప్పుకున్న క్రమంలో ఆ ఫార్మాట్ లో బాధ్యతల్ని సాహాకు అప్పజెప్పారు. టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ బాధ్యతల్లో సాహా సక్సెస్ అయ్యాడు కూడా. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో సాహాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకు కారణం మహేంద్ర సింగ్ ధోని ఉండటం. 2019 వరల్డ్ కప్ వరకూ ధోని జట్టులో ఉండాటనే సంకేతాల్ని చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే ఇచ్చేశాడు. ఈ తరుణంలో సాహా చేసిన వ్యాఖ్యలు ధోని అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేశాయి. అందుకు కారణం వచ్చే వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకోవడం కోసం తీవ్రంగా యత్నిస్తున్నట్లు సాహా పేర్కొనడమే. ఇది తన భార్య బలంగా కోరుకుంటున్న కోరికగా ఓ కార్యక్రమానికి హాజరైన సాహా తెలిపారు.
దీనిపై ధోని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వరల్డ్ కప్ లో నీవు ఆడతానని చెప్పడం దేనికి సంకేతం. నీ మనసులో ఉన్న ఆంతర్యం ఏమిటి?అని ధోని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 'సాహా.. నీ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టాం. నువ్వు ఆడతానంటే.. ధోని జట్టు నుంచి వెళ్లిపోవాలా? అంటూ ఒకరు నిలదీశారు. ఎంఎస్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా నీకుందా? అని మరొక అభిమాని ప్రశ్నించారు. ఇప్పటివరకూ 9 వన్డేలు ఆడిన నీ సగటు 13.66 మాత్రమే. అత్యుత్తమ స్కోరు 16 పరుగులు. మరి అటువంటప్పుడు మ్యాచ్ ఫినిషర్ అయిన ధోని జట్టు నుంచి వైదొలగాలా?అని మరొక అభిమాని విమర్శించాడు.