
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ధోని వన్డే పరుగులు 9,898. దాంతో పదివేల పరుగుల మైలురాయిని ధోని సునాయాసంగా చేరుకుంటాడని భావించినప్పటికీ ఐదు వన్డేలు ముగిసేనాటికి ఆ మార్కును ఇంకా అందుకోలేకపోయాడు. నాల్గో వన్డేలో 42 పరుగులు మినహా ధోని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ ధోని 69 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా పదివేల పరుగుల మార్కుకు 33 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ప్రస్తుతానికి ధోని చేసిన వన్డే పరుగులు 9,967.
మరి సఫారీ గడ్డపై ధోని పదివేల పరుగుల ఘనతను సాధిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో ధోని పదివేల మార్కును చేరితే ఆ ఘనత సాధించిన నాల్గో భారత ఆటగాడిగా ధోని నిలుస్తాడు. మరొకవైపు మరో నాలుగు క్యాచ్‌లు అందుకుంటే వికెట్ కీపర్‌గా మూడొందల వన్డే క్యాచ్‌లు పట్టిన తొలి టీమిండియా క్రికెటర్‌గా ధోని రికార్డు సృష్టిస్తాడు. శుక్రవారం సెంచూరియన్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఈ రెండు ఘనతల్ని సాధిస్తాడా లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment