
ధోని వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి?
జట్టులో ఆడేటప్పుడే అందరూ ఫాం ఉంటారను కోవటం పారపాటే. ఒక టోర్నీ జరిగేటప్పుడు ఆటగాళ్ల ఫాంను కూడా లెక్కించడం కూడా కష్టమే. ఒక మ్యాచ్ లో గెలిస్తే..మరో మ్యాచ్ కి అదే టీంను కొనసాగించడం ఎక్కువగా జరుగుతుంది. ఆ తరుణంలో ఒకరిద్దరి ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన కూడా పెద్దగా లెక్కించరు. సమిష్టిగా విజయాలు సాధిస్తున్నప్పుడు టీం లో ఏమీ మార్పులు ఉండవు. ఆ రకంగానే యువరాజ్ చివరి వరకూ జట్టులో కొనసాగాడు. కాగా, చివరి మ్యాచ్.. అదీ ఒక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో జట్టును నైరాశ్యంలోకి నెట్టి యువీ ఆడిన తీరు ఎంతమాత్రం సబబు కాదు. ఒకప్రక్క విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తుంటే అతనికి స్ట్రైకింగ్ ఇచ్చేందుకు కూడా యువీ యత్నించకపోవడమే అతను మానసికంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడనేది అర్దమవుతోంది. ఆటంటే సవాళ్లు..ప్రతి సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే అన్నిరకాలుగా ఫిట్ గా ఉండాలి.
మరి ఆ ఆటతీరు ప్రేక్షకులకే చికాకు తెప్పిస్తే జట్టు కెప్టెన్ కు అసహనానికి గురి చేయదా? అదే కనిపించింది నిన్నటి మన టీం ఇండియా కెప్టెన్ ధోని మాటల్లో..ఏ క్రికెటర్ కూడా కావాలని చెత్తగా ఆడడు. కానీ ఆటలో ఇవన్నీ సహజం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటూ యువీకి మద్దతుగా మాట్లాడాడు. కానీ... అదే ధోని పరోక్షంగా యువీ కెరీర్ ముగిసినట్లే అనే సంకేతమిచ్చాడు. యువరాజ్ భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నకు ‘ఈరోజు గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. ఎందుకంటే భారత క్రికెట్‌కు సీజన్ అయిపోయింది. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఆడాలి. దాని తర్వాత మళ్లీ భారత జట్టు ఎంపిక సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం’ అన్నాడు.
ప్రస్తుతానికి టీం ఇండియా ఆడే మ్యాచ్ లు ఏమీ లేకపోవడంతో సెలక్షన్ సమస్య ఇప్పటికి ఉండదు. అయితే రాబోయే రోజుల్లో యువరాజ్ భవితవ్యం ఏంటనేది ఈపాటికి అభిమానులకు అర్థమయ్యే ఉంటుంది.