
సన్ రైజర్స్‌కు ముంబై ఇండియన్స్ షాక్
ముంబై: ఐపీఎల్-10లో సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ నెగ్గింది. పటిష్ట బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. సర్ రైజర్స్ నిర్దేషించిన 159 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు వార్నర్ (49), శిఖర్ ధావన్(48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి158 పరుగులు చేసింది. 159 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
బట్లర్(14) అవుటైన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ(4)ను రషీద్ ఖాన్ ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(39), నితీశ్ రాణా(36 బంతుల్లో 45: 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కృణాల్ పాండ్యా(20 బంతుల్లో 37: 3 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో కృణాల్, రాణా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా(2), హర్బజన్(3)లు ముంబైని లక్ష్యానికి చేర్చారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్‌ధావన్‌లు 81 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ఈ స్థితిలో జట్టు ముంబై ముందు భారీ లక్ష్యాన్ని నిలుపుతుందనుకున్న సన్ రైజర్స్ వార్నర్ (49) వికెట్ కోల్పోయిన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీపక్ హుడా(9)ను హర్బజన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ధావన్(48) ఔటయ్యాడు. బెన్ కటింగ్(20) పరవాలేదనిపించినా.. యువరాజ్ సింగ్(5), నమన్ ఓజా(9) నిరాశపరిచారు. 9 పరుగుల వ్యవధిలో నాలుగె వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా 3, హర్భజన్ 2వికెట్లు పడగొట్టగా.. మలింగ, పాండ్యా, మిచెల్ మెక్లిగాన్‌లకు చెరో వికెట్ దక్కింది.
కొంపముంచిన నెహ్రా, ముస్తాఫిజర్
భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 21 పరుగులు ఇవ్వగా.. ఇతర పేస్ బౌలర్లు ఆశీష్ నెహ్రా, ముస్తాఫిజర్ దారుణంగా విఫలమయ్యారు. నాలుగు ఓవర్లు వేసిన నెహ్రా 1 వికెట్ తీసి 46 పరుగులు ఇవ్వగా.. ముస్తాఫిజర్ 2.4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు.