
మరో బంతి ఎందుకంటే...
రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్దేశించినట్టు 14.3 ఓవర్లలో 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.... ఆ సమయానికి 189 పరుగులే చేయడంతో అందరూ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్టే అనుకున్నారు.
ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్దేశించినట్టు 14.3 ఓవర్లలో 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.... ఆ సమయానికి 189 పరుగులే చేయడంతో అందరూ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్టే అనుకున్నారు. అయితే అనూహ్యంగా వారికి మరో బంతిని ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బంతిని ఆదిత్య తారే సిక్స్‌గా మలిచి జట్టును ఒడ్డున పడేసిన విషయం తెలిసిందే. అయితే 189 పరుగులతో స్కోరు సమం అయిన సమయానికి ముంబై జట్టు రాజస్థాన్ రాయల్స్‌కన్నా స్వల్పంగా ఎక్కువ రన్‌రేట్ కలిగి ఉంది.
ఆ సమయానికి ముంబై నెట్ రన్‌రేట్ 0.078099 కాగా రాజస్థాన్ రన్‌రేట్ 0.076821గా ఉంది. అయితే అదనంగా ఇచ్చిన నాలుగో బంతికి ముంబై సింగిల్ తీస్తే ఆ జట్టు రన్‌రేట్ రాజస్థాన్‌కన్నా కిందికి పడిపోయేది. దీన్ని బట్టి ముంబై ఆ బంతికి కనీసం రెండు పరుగులైనా చేయాల్సి ఉంటుంది. అయితే 190 పరుగులు చేస్తేనే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి రెండు పరుగులు చేయడమనేది ఉండదు. దీంతో ముంబైకి బౌండరీ లక్ష్యాన్ని విధించారు. దీన్ని విజయవంతంగా ఆ జట్టు అధిగమించింది.
టై అవుతుందని ఊహించలేదు
రాయుడు రనౌట్ అయినప్పుడు 14.3 ఓవర్లలో స్కోరు సమమైంది. అసలు ఎవరు అర్హత సాధించారో మాకు అర్థం కాలేదు. 14వ ఓవర్ లేదా మరో రెండు బంతుల్లో మ్యాచ్‌ను గెలవాలనుకున్నాం. కానీ టై అవుతుందని ఊహించలేదు. బిగ్ స్క్రీన్‌లో ఇది చూపిస్తున్నా నేనటు చూడలేదు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టి రాజస్థాన్ రాయల్స్ కన్నా రన్‌రేట్ మెరుగుపరుచుకుంటామని అనుకున్నాం.
- రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ కెప్టెన్)
నిరాశచెందాం
మ్యాచ్‌ను ముగించిన తీరు నిరాశ కలిగించింది. ముంబై అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 14.4 ఓవర్లలోనే 195 పరుగులు సాధించడం అత్యద్భుతం. మంచి పిచ్ అయినా మా ప్రణాళికలను సరిగా అమలు చేయలేదు. మా బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. ఓవర్‌కు పది పరుగుల వరకు ఇచ్చినా మ్యాచ్ మా వైపే ఉండేది. కానీ వారు 15 పరుగులకు పైగా సాధించారు. మ్యాచ్ టై అయినప్పుడు ఓ దశలో మేమే గెలిచామనుకున్నాం.
- రాహుల్ ద్రవిడ్ (రాజస్థాన్ రాయల్స్ మెంటర్)