మున్రో మెరుపులు
52 బంతుల్లో సెంచరీ
రెండో టి20లోనూ కివీస్ గెలుపు
మౌంట్ మాంగనూ (న్యూజిలాండ్): కొలిన్ మున్రో (54 బంతుల్లో 101; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీతో విరుచుకుపడగా... బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20లో న్యూజిలాండ్ 47 పరుగుల తేడా తో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. చివరి టి20 ఆదివారం ఇదే వేదికపై జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. టామ్ బ్రూస్ (39 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఆనందంలో ఉన్న బంగ్లా బౌలర్లను వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మున్రో ఓ ఆటాడుకున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ 52 బంతుల్లోనే మున్రో తన తొలి శతకం బాదాడు.
రూబెల్ హŸస్సేన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 18.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఐష్ సోధికి మూడు, వీలర్, విలియమ్సన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మున్రో శతకంతో టి20ల్లో అత్యధిక సెంచరీలు (మెకల్లమ్ రెండు, గప్టిల్, మున్రో ఒక్కోటి) సాధించిన జట్టుగా న్యూజిలాండ్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఖాతాలో మూడేసి సెంచరీలు ఉన్నాయి.