లండన్: మరికొద్ది రోజుల్లో వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఏ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయననే విషయంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు తమతమ దేశాలను అభిమాన జట్లుగా చెప్పుకొంటున్నప్పటికీ పలువురు విదేశీ క్రికెట్ దిగ్గజాలు మాత్రం భారత క్రికెట్ జట్టే బలమైన జట్టనే పేర్కొంటున్నారు. ఈ జాబితాలో తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ కూడా చేరిపోయారు. ఈసారి వరల్డ్‌కప్‌లో భారత జట్టుతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు.
‘ఈసారి ప్రపంచకప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి భారత్. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. అందుకే ఆ జట్టును చూసి అన్ని జట్లూ భయపడుతున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు అత్యుత్తమ ఫినిషర్ ధోనrనికూడా జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ విషయంలో నంబర్ వన్ బుమ్రా, భువనేశ్వర్‌కుమార్ ఉండటం అదనపు బలం. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా తిప్పలు పెట్టే సత్తా బుమ్రాకు ఉంది. భువనేశ్వర్ కూడా అంతే. బ్యాటింగ్ విషయంలో శిఖర్ ధావన్, రోహిత్‌శర్మ కలిసి పవర్‌ప్లేలో పరుగులు పిండుకుంటున్నారు. ఛేదనలో భారత్ మంచి రికార్డు కలిగి ఉంది. కప్పు గెలవాలంటే ప్రతి జట్టు భారత్‌ను దాటాల్సిన అవసరం ఉంది’ అని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment