ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆస్ర్టేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ పేర్కొన్నాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి 2017 అక్టోబర్‌లోనే ఐసీసీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2023 నుంచి 2031 మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సిరీస్‌లలో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను అమలు చేయాలని ఐసీసీ పేర్కొంది.
సాధారణంగా ఐదు రోజుల టెస్టు మ్యచ్‌లో రోజుకు 90 ఓవర్ల ఆట ఉండగా దానిని నాలుగు రోజులకు కుదించనుండడంతో రోజుకు 98 ఓవర్లు ఆడాల్సి వస్తుంది. 2018 నుంచి టెస్టు మ్యాచ్‌ల పరిస్థితి చూసుకుంటే దాదాపు 60 శాతం మ్యాచ్‌లు నాలుగురోజుల్లోనే ముగుస్తుండడంతో ఐసీసీ నాలుగురోజుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. అయితే ఐసీసీ ప్రతిపాదనను పలువురు మాజీ క్రికెటర్లు స్వాగతించారు. అందులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్, తదితరులు ఉన్నారు.
'ఐసీసీ తెచ్చిన నాలుగురోజుల టెస్టు మ్యాచ్ ప్రతిపాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. నాలుగు రోజుల మ్యాచ్‌లు అమలు చేస్తే విజయాల శాతం కంటే డ్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు 2014లో అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చూసుకుంటే ఐదవ రోజున చివరి గంటలో ఫలితం తేలడం చూశారు. అలాగే 2014లోనే కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యచ్‌లో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా మా బౌలర్ రేయాన్ హారిస్ మోర్నీ మోర్కెల్‌ను అవుట్ చేసి మా జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలు ఐదవ రోజునే వచ్చాయి. అందుకే నా దృష్టిలో నాలుగు రోజుల మ్యాచ్‌లు అమలు చేస్తే డ్రాలు ఎక్కువవుతాయి. దీంతో పాటు నా వ్యతిరేకతకు మరో కారణం కూడా ఉంది. ఈరోజుల్లో పిచ్‌ల స్వభావం ప్లాట్‌గా మారిపోయి బ్యాట్సమెన్‌కు అవకాశంగా మారడంతో బౌలర్లు వికెట్లు తీయడానికి అపసోపాలు పడుతున్నారు.అయితే ఐదవ రోజున పరిస్థితులు తారుమారుయ్యే అవకాశం ఉండడంతో స్పిన్నర్లు వికెట్లు పడగొట్టడంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంది. ఐసీసీ నా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోదని నాకు తెలుసు, అయినా సరే నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటు' నాథన్ లియోన్ పేర్కొన్నాడు. (చదవండి : నా తండ్రి కంటే నాకు ఏది ఎక్కువ కాదు)
Comments
Please login to add a commentAdd a comment