
జాతీయ క్రీడల్లో అరుణకు రజతం
తిరువనంతపురం: కనువిందైన విన్యాసాలతో అలరించిన ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్ బుడ్డా అరుణా రెడ్డి శువ్రారం మహిళల ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. దీపా కర్మాకర్ (త్రిపుర) 13.0000 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా... అరుణా రెడ్డి 11.8600 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ జాతీయ క్రీడల్లోనూ తన సత్తా చాటుకుంది. ఇప్పటివరకు ఆమె ఆల్‌రౌండ్, టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్‌ఈవెన్ పారలల్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగాలతో కలిపి మొత్తం ఐదు స్వర్ణ పతకాలు నెగ్గడం విశేషం. ఇక పతకాల పట్టికలో సర్వీసెస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.