జాతీయ బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు అమృత్ సింగ్ దోపిడీ, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
న్యూఢిల్లీ: జాతీయ బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు అమృత్ సింగ్ దోపిడీ, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ జంట నుంచి విలువైన వస్తువులు దోచుకోవడంతో పాటు మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్టు అమృత్ సింగ్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్ ఎదుట సింగ్ను హాజరు పరచగా.. విచారణ కోసం ఓ రోజు పోలీస్ కస్టడీకి ఆదేశించారు. నిందితుడి నుంచి దోపిడీకి గురైన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్ సింగ్ గుర్గావ్లోని ఓ పాఠశాలలో వ్యాయామ విద్య శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దక్షిణ ఢిల్లీలోని లజ్పతి నగర్ ప్రాంతంలో ఆఫ్ఘాన్ జంట మందులు తీసుకోవడానికి వెళ్తుండగా వారిపై దాడి చేసి విదేశీ కరెన్సీ, నగదు దోచుకున్నాడు. మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు, బాధితుల ఫిర్యాదు మేరకు ఆదివారం సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.