'యువీ, రైనాలను కట్టడి చేయాలి'
అడిలైడ్: టీమిండియాతో జరుగనున్న మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో ప్రత్యేకంగా యువరాజ్ సింగ్, సురేష్ రైనాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పష్టం చేశాడు. ట్వంటీ 20 ఫార్మెట్ లో యువీ, రైనాలు సీనియర్ ఆటగాళ్లు కావడంతో పాటు, చాలా ప్రమాదకరమైన ఆటగాళ్ల అని ఫించ్ తన సహచర బౌలర్లను హెచ్చరించాడు. ఆ ఇద్దర్నీ నియంత్రించడానికి బౌలర్లు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. టీమిండియా జట్టులో చాలా మంది అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ఈ సందర్భంగా ఫించ్ తెలిపాడు.
త్వరలో భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగుతున్నందున ఈ సిరీస్ ను భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇప్పటికే తమ జట్టు వక్యిగత ప్రణాళికలతో టీమిండియాను ఎదుర్కొవడానికి సిద్ధమవుతున్నా.. యువీ, రైనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. తమ బౌలర్లు కచ్చితంగా టీమిండియాను నిలువరిస్తారని ఆశిస్తున్నట్లు ఫించ్ పేర్కొన్నాడు.