వాళ్ల రాకతో సచిన్ ఆనందం
ముంబై: భారత టీ-20 జట్టులోకి ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్, ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా తిరిగిరావడం పట్ల బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆడనున్న మూడు మ్యాచుల టీ-20 సీరిస్ కోసం సీనియర్ ఆటగాళ్లు యూవీ, నెహ్రా మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'వాళ్లు తిరిగి రావడం ఆనందం కలిగిస్తున్నది. ఇది వారి అకుంఠిత దీక్షకు నిదర్శనం. వారికి, ఆస్ట్రేలియా పర్యటనలోని భారత్ జట్టుకు సంపూర్ణ విజయాలు లభించాలని కోరుకుంటున్నా' అని సచిన్ తెలిపారు.
ప్రస్తుతం వెటరన్ క్రికెటర్ల కెటగిరీలోకి వెళ్లిపోయిన యూవీ, నెహ్రాకు ఒకప్పుడు భారత్ జట్టులో ఘనమైన రికార్డు ఉంది. 2011లో భారత్ ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో ఘనమైన పాత్ర పోషించిన 33 ఏళ్ల యూవీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. 2014లో టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌కు అతను ప్రాతినిధ్యం వహించాడు. 2011 వరల్డ్‌కప్ విజయంలో 37 ఏళ్ల నెహ్రా పాత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు అనూహ్యంగా టీ-20 జట్టులో చోటు కల్పించారు.